తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. తొంభై ఏళ్ల వయసులోనూ నటిస్తూ ఈ తరానికి సవాల్ విసురుతున్నారు. భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటోన్న నేపథ్యంలో ఏఎన్‌ఆర్ నటనా జీవితం గురించి ఓ సారి తెలుసుకుందాం.
తమిళసినిమా, న్యూస్‌లైన్: తాను ఇప్పటికీ నటనలో విద్యార్థినే అంటారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి ఆయన బాల్యం నుంచే నటనకు అంకితమయ్యూరు. ఏఎన్‌ఆర్ 1923 సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని రామాపురంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే కళామతల్లి సేవకు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ. మధ్య తరగతి కుటుంబం. అక్కినేని విద్యాభ్యాసం ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అప్పట్లో దాన్ని ఒక కొరతగా ఆయన భావించలేదు. పాఠశాల విద్యకు బదులు నటనకు బాటలు వేసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడయ్యారు. ఈ పయనంలో ఆయన తల్లి ప్రోత్సాహం మరువలేనిది. అక్కినేని మొదట ప్రాచుర్యం పొందింది స్త్రీ పాత్రల ద్వారానే. ఆ రోజుల్లో స్త్రీలు నటించడానికి ముందుకొచ్చేవారు కాదు. అందువలన వారి పాత్రలనూ పురుషులే పోషించేవారు. అలా అక్కినేని స్త్రీ పాత్రల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే అక్కినేని స్త్రీ పాత్ర వేస్తే సింగారమే అనేవారు.
స్ఫూర్తి ప్రదాత
నటుడన్న ప్రతి వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఏఎన్‌ఆర్. అరుుతే ఘంటసాల బలరామయ్య తనకు స్ఫూర్తి ప్రదాత అంటారు అక్కినేని. బెజవాడ (నేటి విజయవాడ) రైల్వేస్టేషన్‌లో తారసపడ్డ అక్కినేనిని మద్రాసు తీసుకొచ్చింది ఘంటసాల బలరామయ్యే. ఆయన రూపొందించిన శ్రీరామ జననం చిత్రం ద్వారా అక్కినేని శ్రీరాముడుగా పరిచయమయ్యారు. అయితే నాగేశ్వరరావు తొలి చిత్రంగా ధర్మపత్నిగా నమోదైంది. ఈ చిత్రంలో హీరోకు స్నేహితుడిగా అక్కినేని నటించారు.
విజయ దుందుభి
బాలరాజు, కీలుగుర్రం చిత్రాలతో అక్కినేని విజయ దుందుభి మొదలైంది. తర్వాత ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అక్కినేని చేయని పాత్రంటూ లేదు. దేవదాసు, ప్రేమనగర్, అనార్కలి, భక్త తుకారం, సెక్రటరీ, తెనాలి రామకృష్ణ, మాంగల్యబలం, మంచి మనసులు, అంతస్తులు, దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం ఇలా ఒక్కో చిత్రం ఆణిముత్యమే.
క్లాస్ హీరో
తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరువలేని నటుడు ఎన్‌టీఆర్. ఆయనకు సాటి ఏఎన్‌ఆరే. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ మధ్య చక్కని స్నేహబంధం ఉండేది. ఏఎన్‌ఆర్ క్లాస్ హీరోగా, ఎన్‌టీఆర్ మాస్ హీరోగా పేరు పొందారు. పాత్రల్లో వీరి మధ్య పోటీ తీవ్రస్థారుులో ఉందని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తానెవరినీ పోటీగా భావించడం లేదని, నటనను ఆస్వాదిస్తున్నానని అక్కినేని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
గుప్తదానాలెన్నో..
గుప్త దానాలతో ఎందరినో ఆదుకున్న దాత ఏఎన్‌ఆర్. ఈయన బాల్యంలో విద్యకు దూరమయ్యూరు. విద్య ప్రాధాన్యం గుర్తించిన అక్కినేని విద్యాదాతగా మారారు. గుడివాడలో అక్కినేని కళాశాల నెలకొల్పారు. ఈ కళాశాలకు అక్కినేని పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. అలాగే గుప్తదానాలు ఎన్నో చేశారు.
అవార్డులకే అలంకారం
అక్కినేని నాగేశ్వరరావును ఎన్నో అవార్డులు వరించారుు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. వెండితెర పితామహుడు రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్ ఇలా ఎన్నో అవార్డులు అక్కినేనిని వరించారుు. అరుు తే అవార్డులకే ఆయన అలంకారమయ్యూరు.
90లోనూ నటన
బాల నటుడిగా జీవితం ప్రారంభించారు అక్కినేని. తొంభై ఏళ్ల వయసులోనూ ఆయన నటిస్తున్నారు. తాజాగా మనం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఏఎన్‌ఆర్ కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్య నటిస్తుండడం విశేషం. ఇలా ఒకే కుటుంబంలో మూడు తరాల నటులు నటించడం దక్షిణాదిలో ప్రప్రథం. జీవితంలో ఎన్నో సాధించిన అక్కినేనిలోనూ చిన్న అసంతృప్తి ఉంది. గ్లోబల్ స్థాయిలో మన సినిమా స్థానం సంపాదించుకోలేదన్నదే ఆ అసంతృప్తి. ప్రయోగాత్మక చిత్రాలు రావాలన్నది ఆయన మనసులోని భావం. 90 వసంతాల అక్కినేని నాగేశ్వరరావును నూరు వసంతాల సినిమా వేడుకలో ఆదివారం ఘనంగా సత్కరించనున్నారు.