అక్షరహాసన్
సినిమా: అయ్యయ్యో నా హృదయం బద్దలైపోయిందే అంటూ గుండెలు బాదుకుంటోంది నటి అక్షరహాసన్. నటుడు కమలహాసన్ రెండవ కూతురైన ఈ బ్యూటీ తొలుత కెమెరా వెనుక రాణించాలని భావించి బాలీవుడ్‌లో సహాయదర్శకురాలిగా కెరీర్‌ను మొదలు పెట్టినా, ఆ తరువాత షమితాబ్ అనే చిత్రం హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసింది. అయితే అలా కూడా బిజీ కాలేకపోయింది. ఆ తరువాత లాలీ షాది మే లడ్డూ దివానా అనే చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగ పడలేదు. ఇక కోలీవుడ్‌లో అజిత్ హీరోగా నటించిన వివేగం చిత్రంలో ఒక గెస్ట్ పాత్రలో మెరిసింది. ఆ తరువాత ఇక్కడా అవకాశాలు లేవు. దీంతో తన తండ్రి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న శభాష్‌నాయుడు చిత్రానికి సహాయ దర్శకురాలిగా బాధ్యతలను చేపట్టింది.
ఆ చిత్రం కూడా కడ చేరలేదు. షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఇకపోతే కమలహాసనే అక్షరహాసన్‌ను నటిగా ప్రోత్సహించాలని భావించి విక్రమ్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందులో నటి అక్షరహాసన్ నటించనున్నట్టు వెల్లడించారు. ఆ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అక్షరహాసన్ తన గుండె బద్దలైపోయింది. తన లేత పరువం ముగిసిపోయింది లాంటి వ్యాఖ్యలు చేసింది. అక్షరహాసన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతగా కొంపలేం మునిగిపోయాయి అన్నది తెలుసుకోవాలనుందా? అయితే రండి చూద్దాం అక్షరహాసన్ ఇటీవల హాలీవుడ్ చిత్రం లోగన్‌ను చూసే అలా రియాక్ట్ అయింది. ఆ చిత్రంలో ప్రఖ్యాత నటుడు వోల్వేరిన్ హీరోగా నటించారు. ఆయన చిత్ర తుదిఘట్టంలో మరణిస్తారట. ఆ సన్నివేశాన్ని చూసిన నటి అక్షరహాసన్ తట్టుకోలేక గుండె బద్దలైపోయిందే అంటూ తన ఆవేదనను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అందరిని కంగారు పెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment