బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌కు దేశమంటే ఎనలేని ప్రేమ. ఒకవైపు దేశభక్తి చిత్రాల్లో నటించడమే కాదు.. మరోవైపు జవాన్లకు ఆర్థిక సాయం అందజేయడం.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేపట్టారు. భారత్ అంటే తనకు ఎంతో ప్రేమ అని చాటారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చుట్టు పౌరసత్వ వివాదం ముసురుకుంటోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం.. భారత్‌కు బదులు కెనడా దేశ పౌరసత్వం ఆయన కలిగి ఉండటం అందుకు కారణం.
ఎట్టకేలకు పౌరసత్వ వివాదంపై అక్షయ్‌కుమార్ స్పందించారు. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన.. అదే సమయంలో మాతృదేశమైన భారత్ అంటే తనకు ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు. కెనడా పౌరసత్వం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, గత ఏడేళ్లలో తాను ఎన్నడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ.. ఇక్కడే అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఈ క్రమంలోనే ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో కెనడా టోరంటోలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్.. ‘మీకో విషయం తప్పకుండా చెప్పాలి. టోరంటో నా సొంతూరు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రిటైరయ్యాక నేను ఇక్కడికే వచ్చి స్థిరపడతాను’ అని పేర్కొంటున్న వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. దేశం మీద ప్రేమ ఉందంటూనే.. అక్షయ్‌కుమార్ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా.. గతంలో ఎప్పుడూ అన్న మాటలను వెలుగులోకి తెచ్చి.. అక్షయ్ దేశభక్తిని శంకించడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment