అల ఆర్కే బీచ్‌లో..     | Ala Vaikunthapurramuloo Movie Success Celebrations In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అల ఆర్కే బీచ్‌లో..    

Published Mon, Jan 20 2020 8:15 AM | Last Updated on Mon, Jan 20 2020 8:16 AM

Ala Vaikunthapurramuloo Movie Success Celebrations In Visakhapatnam - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో దూసుకుపోతున్న అల వైకుంఠపురంలో చిత్ర బృందం ఆదివారం సాగర తీరంలో సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సభను ఆర్కేబీచ్‌లో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్‌ పూజా హెగ్డే సినిమాలో పాటలకు డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించారు. ఈ వేడుకల్లో డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు పాల్గొన్నారు.

విశాఖ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి
విశాఖ అభివృద్ధిలో చిత్ర పరిశ్రమ పాలుపంచుకోవాలని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చిత్ర ప్రమోషన్స్‌ మాత్రమే కాకుండా షూటింగ్‌లు విరివిగా ఇక్కడే జరపాలన్నారు. విశాఖలో ఎటు చూసినా అందాలేనని.. షూటింగ్‌లకు అనుకూలమన్నారు. స్టూడియోలు నిర్మించి విశాఖకు ఆప్తులుకావాలని పిలుపునిచ్చారు. అభిమానులకు చిరంజీవి ఓ దేవుడైతే.. అరవింద్‌ పర్యవేక్షకుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చిత్రపటాలను అందజేసి సత్కరించారు.

అభిమానుల సాక్షిగా ‘రాములో రాములా’
అల వైకుంఠపురంలో విపరీతంగా ట్రెండ్‌ అయినా ‘రాములో రాములా’ పాటకు బన్నీ, పూజా హెగ్డే అద్భుతమైన స్టెప్పులు వేసి విశాఖ అభిమానులను అలరించారు. యువకులు గ్యాలరీ లో ఈలలు, చప్పట్లతో మార్మోగేలా చేశారు. అ భిమానులు పూర్తి స్థాయిలో ఎంజాయ్‌ చేశారు.

సామజవరగమనా అంటూ మెప్పించిన పూజా
‘సామజవరగమనా నిను చూసి ఆగగలనా’ అంటూ పూజా హెగ్డే సాగర తీరాన తన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్‌ అనిపించింది. అంతకుముందు పూజా తెలుగులో మాట్లాడుతూ విశాఖ వాసులు ఎంతో మంచివాళ్లని కొనియాడారు. సినిమాను ఎంతగానో ప్రేమించే ప్రేక్షకులు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సొంతమన్నారు. బన్నీతో రెండోసారి నటించడం చాలా ఆనందంగా ఉందని, మరిన్ని సినిమాల్లో ఆయన సరసన నటించాలని ఉందన్నారు.

అలరించిన థమన్‌ బృందం
మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ బృందం చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. వారితోపాటు శివమణి 20 నిమిషాలకుపైగా తన డ్రమ్స్‌ ప్రదర్శనతో అదరహో అనిపించారు. సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పాటకు చేసిన డ్యాన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.

అడుగడుగునా ‘శ్రేయాస్‌’ లోపం
శ్రేయాస్‌ మీడియా అంటే తెలియనివారుండరు. సౌత్‌ ఇండియాలో పెద్ద సినిమాల ప్రమోషన్స్‌ ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఈవెంట్‌ నిర్వహణలో ప్లానింగ్‌ లోపం కారణంగా ఎప్పుడు విశాఖలో ఏ సినిమా ఈవెంట్‌ జరిగినా అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు నరకమే. విశాఖ నిర్వహించే ఈవెంట్లకు పాస్‌లను ఎక్కువమందికి ఇష్టానుసారంగా ఇవ్వడం.. వచ్చిన వారికి కూర్చోవడానికి కూడా స్థలం లేక ఇబ్బందులు పడడం పరిపాటిగా మారింది.     అభిమాన తారలను చూసేందుకు వచ్చిన వారంతా రోడ్డుపై బారులు తీరుతుండడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో సిరిపురంలో నిర్వహించిన ఈవెంట్‌లో కూడా ఇలాగే జరిగితే నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. అయినా శ్రేయాస్‌ మీడియా తీరు మారలేదు. స్థలం తక్కువగా ఉండి పాస్‌లను అధిక సంఖ్యలో జారీ చేసి ప్రేక్షకులకు నరకం చూపించారు. 

నా ప్రతి సినిమాకు వైజాగ్‌తో సంబంధం:  అర్జున్‌
హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాల్లో వైజాగ్‌కు ఏదో ఒక సంబంధం ఉండి తీరుతుందన్నారు. మంచి సినిమా తీస్తే ఎంతలా ఆదరిస్తారో ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్నారు. థమన్‌ మ్యూజిక్‌ ఈ సినిమా విజయంతో కీలక పాత్ర ప్రోషించిందన్నారు. ఇన్ని సినిమాలు చేసి విజయం సాధించినా.. ఎవరూ నా నటన బాగుందని ఫోన్‌ చేసి చెప్పలేదు. కానీ ఈ సినిమాకు ప్రతీ ఒక్కరూ ఫోన్‌ చేసి నటన బాగుందని చెబుతున్నారనంటే దానికి కారణం త్రివిక్రమ్‌ అన్నారు. ఆయన వల్లే ఇండస్ట్రీ హిట్‌ సాధించామన్నారు. ఎవరికైనా అభిమానులు ఉంటారు కానీ తనకు మాత్రం ఆర్మీ ఉంది అన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్‌ చెప్పి ప్రేక్షకులను అలరించారు.  

ఉత్సవ నగరం విశాఖ:  త్రివిక్రమ్‌
డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ, చలం, సీతారామశాస్త్రి లాంటి ఎంతో గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన ఘనత విశాఖదే అన్నారు. విశాఖ ఎప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సవంగా ఉంటుందని కొనియాడారు. విశాఖ ప్రజలు కూడా అలానే ఉంటారన్నారు. విశాఖలో సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బన్ని కనిపించలేదని కేవలం బంటు మాత్రమే కనిపించేలా నటించి ఈ చిత్ర విజయానికి కారణమయ్యారన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement