స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు కరెక్ట్ సినిమా పడితే ఫలితం ఎలా ఉంటుందో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో తెలిసిపోయింది. అగ్నికి వాయువు తోడైనట్టు బన్నికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జతకడితే ఆ చిత్రం మరో ఆణిముత్యంగా మిగలడం పక్కా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు హిట్ సాధించాయి. కాగా ముచ్చటగా మూడో సారి జతకట్టిన ఈ ద్వయం హ్యాట్రిక్ సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కనివిని ఎరుగని రీతిలో వసూళ్లు రాబడుతోంది. దీంతో బన్ని-త్రివిక్రమ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదే తరుణంలో ‘అల.. వైకుంఠపుమరములో’ సినిమా ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ మరో కానుక అందించింది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిరిపడు’ పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఆడియోలో దాచిపెట్టిన ఈ సాంగ్ థియేటర్‌లో ఈలలు వేయించింది. ఈ పాటను ఫైట్‌గా తీసి గొప్ప ప్రయోగం చేశారు దర్శకుడు. తాజాగా ‘సిత్తరాల సిరిపడు’ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. థియేటర్‌లో దుమ్ముదులిపిన ఈ పాట నెట్టింట్లో కూడా వైరల్ అవుతోంది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆల.. వైకుంఠపురములో’ ఆల్బమ్‌లోకి కలికితురాయిగా ఈ సాంగ్ వచ్చి చేరిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ పాటను శ్రీకాకుళంకు చెందిన విజయ్‌కుమార్ రచించగా.. సూరన్న, సాకేత్‌లు పాడారు. తమన్ కంపోజ్ చేశాడు. ఇక ఈ పాటకు తమన్ అర్థగంటలో ట్యూన్ కట్టాడని.. ఫోన్‌లోనే విజయ్‌కుమార్ లిరిక్స్ అందించాడని తివ్రిక్రమ్ తెలిపాడు. శ్రీకాకుళం యాసలో సాగిన ఈ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్లు డైరెక్టర్ త్రివిక్రమ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి బరిలోకి దిగి ఘన విజయం అందుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు. టబు, సుశాంత్, నివేదా పేతురాజు, జయరాం, సముద్రఖని, సచిన్, సునీల్, నవదీప్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్ సినిమాటోగ్రఫీ అందించాడు.
చదవండి:
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ
కంగ్రాట్స్ బావా.., స్వామి..
Comments
Please login to add a commentAdd a comment