మణి చిత్రంలో అలియా భట్?
మణిరత్నం... భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఇది. దర్శకుడిగా ఆయన సాధించిన ఘనత అది. సూపర్ స్టార్ రజనీకాంత్, పద్మభూషణ్ కమల్ హాసన్ నుంచి ఈ తరం యువ నటుడు గౌతమ్ కార్తీక్ వరకు ఈయన దర్శకత్వంలో నటించారు. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన దర్శకరత్నం తాజా చిత్రం ఏమిటన్నది కొంత కాలంగా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం కడల్. విడుదలై ఏడాదిన్నర దాటింది. గత ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కడల్ చిత్రం తెరపైకొచ్చింది. అంతే ఇప్పటి వరకు మణిరత్నం తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టలేదు.
ఇందుకు కారణం ఇటీవల ఆయనకు సరైన విజయం లేకపోవడమేనన్నది ఒక వర్గం భావన. అయితే మణిరత్నం ప్రయత్నాలు కార్యరూపం దాల్చడంలేదన్నది నిజం. ఆ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్ బాబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శృతిహాసన్‌లతో ఒక భారీ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కారణాలేమయినా ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్‌లతో అలైపాయుదే చిత్రం తరహాలో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం కోసం దుల్కర్ సల్మాన్ నుంచి బల్క్ కాల్‌షీట్స్‌ను పొందినట్లు సమాచారం.
ఇప్పుడు ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌కు బదులు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ఎంపిక చేయూలనుకుంటున్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇటీవల మణిరత్నం వర్గం ఈ సంచలన నటిని సంప్రదించినట్టు సమాచారం. అయితే అలియాభట్ మేనేజర్ ఈ విషయమై నోరు మెదపడానికి నిరాకరిస్తున్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నయినా దర్శకుడే వెల్లడించాల్సి ఉంటుందంటున్నారు. చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడిగా ఖరారయినట్లు తెలిసింది. ఇతర విషయాల గురించి అధికారిక వార్త ఏమీ లేదు. దుల్కర్ సల్మాన్ అన్నట్లు మణిరత్నం పెదవి విప్పే వరకు ఇలాంటి పసలేని ప్రచారం జరుగుతూనే ఉంటుంది.