
కనుల పండుగ!
‘జులాయి’ సినిమాతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాంబినేషన్ అల్లు అర్జున్, తివిక్రమ్. ‘జులాయి’ తర్వాత వీరిద్దరూ విడివిడిగా కూడా విజయాలను అందుకొని మంచి జోష్ మీదున్నారు. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ అంటూ... ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ ‘రేసుగుర్రం’లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘జులాయి’ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్‌లో పాటల్ని, పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.
అదే నెలలో సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మళ్లీ ‘జులాయి’ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బన్నీ నటన ఈ చిత్రానికి హైలైట్. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ ఇందులో కథానాయికలు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం నిండుగా, కన్నుల పండువగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. సింధూతులాని, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.ప్రసాద్, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.