మలయాళ దర్శకులకు ఓపెన్ ఆఫర్
‘‘నేను అల్లు అర్జున్‌నే.. కానీ నా ఇంటి పేరులోని తొలి అక్షరమైన ‘అ’ను తప్పించి, ‘మ’ తగిలించేశారు నా కేరళ అభిమానులు. అలా నన్ను ‘మల్లూ అర్జున్’ని చేసేశారు. మలయాళ స్టార్ హీరోల స్థాయిలో ఆదరిస్తున్నారు. ‘అల్లు అర్జున్’ అని పిలిపించుకోవడం నాకు మామూలే. కానీ ‘మల్లూ అర్జున్’ అని పిలిపించుకోవడం మాత్రం మజాగా ఉంటుంది.’’ ఓ సందర్భంలో తన కేరళ అభిమానులను ఉద్దేశించి బన్నీ అన్న మాటలివి. కేరళలో ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అక్కడి హీరోలకు దీటుగా బన్నీని అభిమానిస్తారు మలయాళీలు. కేవలం అనువాద చిత్రాల ద్వారా అక్కడ ఇంతటి స్టార్‌డమ్‌ని సాధించారు బన్నీ. ఇటీవలే కేరళలోనే త్రిస్సూర్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు.
అల్లు అర్జున్ వస్తున్నాడన్న విషయం మీడియా ద్వారా బయటకు రాగానే... ఆ మాల్ దగ్గరకు అభిమానులు పోటెత్తారు. తనపై అక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం చూసి బన్నీ కూడా పులకించిపోయారు. ఇంకేముంది... అక్కడి దర్శకులకు వేలాది అభిమానుల సాక్షిగా బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ‘‘నాకు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లంటే చాలా ఇష్టం. మీ అందరి అభిమానం చూస్తున్న నాకు నేరుగా మలయాళంలో ఓ సినిమా చేయాలని అనిపిస్తోంది. కొత్తగా వస్తున్న దర్శకులు మలయాళ సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాళ్లకు నేనో విషయం చెప్పాలి. మంచి కథలతో వస్తే మలయాళ సినిమా కూడా చేయడానికి నేను రెడీ’’ అని ప్రకటించేశారు. అంటే.. త్వరలో ఓ మలయాళ సినిమాలో బన్నీని చూడబోతున్నామన్న మాట. మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే మలయాళ దర్శకుడు ఎవరో చూడాలి.