ఏడువందల ఏళ్ల క్రితం ఏం జరిగింది?
‘గౌరవం’, ‘కొత్తజంట’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎంవిఎన్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.శైలేంద్ర బాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీను వైట్ల కెమేరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు.
యువ దర్శకుడు మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ- ‘‘సంవత్సరం నుంచి ఇటువంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా. నేను, నాన్నగారు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన చిత్రమిది. దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణరెడ్డిగారు, మా అన్నయ్యతో ‘బన్ని’ సినిమా నిర్మించారు. ఎంవిఎన్‌గారు చాలా చిత్రాలకు కో-డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశారు.
ఇప్పుడు నా చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవు తున్నారు’’ అని తెలిపారు. ‘‘లవ్ ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది. ఏడువందల సంవత్సరాల క్రితం జరిగిన నేపథ్యం చూపించబోతున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత తీస్తున్న రెండో చిత్రమిది. మంచి కథ కుదిరింది’’ అని శైలేంద్రబాబు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమేరా: సంజయ్ లోకనాథ్.