టాప్ గేర్‌లో అమలాపాల్
అమలాపాల్ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. నటిగా కెరీర్ పుంజుకుంటున్న తరుణంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడి, అంతే వేగంగా ఆయనకు విడాకులిచ్చేసి మళ్లీ నటిగా తన పయనాన్ని ప్రారంభించిన అమలాపాల్ నట జీవితం ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో పరుగెడుతోంది. ఇప్పటికే పసంగ–2, అమ్మాకణక్కు చిత్రాల్లో నటించిన అమలాపాల్ చేతిలో ఇప్పడు ఏకంగా 8 చిత్రాలు ఉన్నాయంటే ఈ అమ్మడు కెరీర్ ఏ రెంజ్‌లో పరిగెడుతుందో ఊహించుకోవచ్చు. తమిళం, మలయాళం అంటూ వరుసపెట్టి ఎడాపెడా నటించేస్తోంది
. ఈ కేరళ భామ నటిస్తున్న చిత్రాల పట్టికను ఒకసారి తిరగేస్తే సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలో వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేస్తున్న అమలాపాల్, కల్పాత్తి అఘోరం ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై శుశీగణేశన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న తిరుట్టుప్పయలే 2 చిత్రంలో బాబీసింహా, ప్రసన్నలతో పోటీ పడి నటిస్తోంది. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ ముండాసిపట్టి చిత్రం ఫేమ్ రామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మిన్‌మిని చిత్రంలో విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తోంది.
ఇంకా భాస్కర్ ది రాస్కెల్ చిత్రంలో అరవిందస్వామితో డ్యూయెట్లు పాడుతోంది. అదే విధంగా సెంచరియన్ ఫిలింస్ జాన్స్, సాలోన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న నూతన చిత్రంలో అమలాపాల్‌నే నాయకి, ఇకపోతే హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న క్వీన్ చిత్ర మలయాళ రీమేక్‌లో అమలాపాల్‌నే రాణి. వీటితో పాటు కన్నన్ దర్శకత్వంలో అచ్చయన్స్ అనే మరో మలయాళ చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇలా ఏకధాటిగా నటిస్తున్న ఏకైన నటి అమలాపాల్‌నేనని చెప్పవచ్చు.