
అవును... వాళ్లిద్దరూ విడిపోయారు
ప్రేమించి, పెళ్లి చేసుకున్న దర్శకుడు విజయ్, నటి అమలాపాల్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని స్పష్టం అయ్యింది. విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విజయ్, అమలాపాల్ విడిపోయారని ఆయన ప్రకటించారు. దర్శకుడు విజయ్ కూడా ఒక భేటీలో అమలాపాల్ ప్రస్తావన అనవసరమనీ, తన తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకుంటాననీ అనడం గమనార్హం.
విజయ్‌కి ఇష్టం లేకపోయినా అమలాపాల్ మళ్లీ నటించడమే వారి మధ్య మనస్పర్థలకు కారణం అని తెలుస్తోంది. అతని తల్లిదండ్రులకు కూడా అమలాపాల్ నటించడం ఇష్టం లేదట. ప్రస్తుతం ధనుష్ సరసన అమలాపాల్ ‘వడచెన్నై’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ముందు ఈ చిత్రంలో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. అయితే, సమంత నిరాకరించడంతో అమలాపాల్‌ని అడగడం, ఆమె అంగీకరించడం జరిగింది. విజయ్, అమలాపాల్ పెళ్లి 2014లో జరిగింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడిపోవడం చర్చనీయాంశమైంది.