ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతాడనుకోలేదు!
‘‘స్నేహితుల దినోత్సవం నాడు మీ ఆప్తమిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలనిపిస్తే, వెంటనే చెప్పేయండి. సన్నిహితుల వివాహ వేడుకలకు తప్పనిసరిగా హాజరై, వారిని ఆనందపరచండి. ఒకవేళ ఇలాంటి సందర్భాలను మిస్సయినా పెద్దగా నష్టం లేదు. కానీ, ఎవరైనా ఆప్తులు తిరిగి రాని లోకాలకు వెళ్లినప్పుడు మాత్రం, వారి అంత్యక్రియలకు తప్పకుండా హాజరవ్వండి. ఎందుకంటే, వాళ్లని ఇక ఎప్పుడూ చూడలేం కనుక’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్.
ఈ బిగ్ బీ ఇలా అనడానికి కారణం ఉంది. దాదాపు 30 ఏళ్లుగా తమ ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తిస్తున్న ఆయన స్టాఫ్ మెంబర్ హఠాన్మరణం పొందారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు అమితాబ్. చనిపోయిన వ్యక్తి గురించి ఆయన చెబుతూ - ‘‘మా అబ్బాయి అభిషేక్, అమ్మాయి శ్వేతా ఆయన చేతుల్లోనే పెరిగారు. మా పిల్లలు ఆయన్ను ‘అంకుల్’ అని పిలిచేవారు. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు.
చనిపోయే రోజు ఉదయం నేను అతనితో మాట్లాడాను. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని, వారం రోజులు సెలవు కావాలంటే సరే అన్నాను. అతను ఊరెళ్లాడు. హఠాత్తుగా గుండెపోటు రావడం, తుది శ్వాస విడవడం జరిగిపోయింది. ఈ వార్త తెలిసి నివ్వెరపోయాను. పుట్టినవాడు మరణించక తప్పదని తెలిసినప్పటికీ, ఇలాంటివి జీర్ణించుకోవడం కష్టం. మళ్లీ ఎక్కడో పుడతాడని మనసుకి సర్దిచెప్పుకోవడం మినహా ఏమీ చేయలేం’’ అన్నారు ఆవేదనగా.