![Amitabh Bachchan shares treasured memories from Amar Akbar Anthony - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/28/amitab.jpg.webp?itok=_wGuFBQ6)
‘‘అమర్ అక్బర్ ఆంటోనీ (అఅఆ) సాధించిన వసూళ్లను ఇప్పటి లెక్కలకు అన్వయిస్తే ‘బాహుబలి 2’ వసూళ్ల కంటే ఎక్కువ’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రల్లో దర్శకుడు మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా విడుదలై మే 27కి 43 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. బచ్చన్, రిషీ, వినోద్ ఖన్నా కెరీర్‌లలో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్ ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘‘మన్మోహన్ దేశాయ్ ఈ కథను నాకు చెప్పడానికి వచ్చినప్పుడే ఈ టైటిల్ (అమర్ అక్బర్ ఆంటోనీ) చెప్పారు. కానీ అప్పటి సినిమాలకు పెడుతున్న స్టయిల్లో లేదు. వర్కౌట్ అవుతుందా? అని సందేహించాను కూడా. కట్ చేస్తే సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లో సుమారు ఏడు కోట్ల 25 లక్షల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. ఒకవేళ ప్రస్తుత లెక్కలతో పోలిస్తే ‘బాహుబలి 2’ని దాటేస్తుందని ట్రేడ్ చెబుతోంది. ‘‘అఅఆ’ సినిమా ముంబైలో 25 థియేటర్స్‌లో దాదాపు 25 వారాల పాటు ఆడింది. ఇంకా ఆడుతోంది’’ అని అప్పట్లో బయ్యర్లు నాతో అన్నారు. ఇప్పుడు అలాంటివి జరగడం లేదు. ఆ రోజులు పోయాయి’’ అన్నారు అమితాబ్.
Comments
Please login to add a commentAdd a comment