Amar Akbar Anthony
-
అఅఆ వసూళ్లు బాహుబలి–2 కంటే ఎక్కువ!
‘‘అమర్ అక్బర్ ఆంటోనీ (అఅఆ) సాధించిన వసూళ్లను ఇప్పటి లెక్కలకు అన్వయిస్తే ‘బాహుబలి 2’ వసూళ్ల కంటే ఎక్కువ’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రల్లో దర్శకుడు మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా విడుదలై మే 27కి 43 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. బచ్చన్, రిషీ, వినోద్ ఖన్నా కెరీర్లలో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్ ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘మన్మోహన్ దేశాయ్ ఈ కథను నాకు చెప్పడానికి వచ్చినప్పుడే ఈ టైటిల్ (అమర్ అక్బర్ ఆంటోనీ) చెప్పారు. కానీ అప్పటి సినిమాలకు పెడుతున్న స్టయిల్లో లేదు. వర్కౌట్ అవుతుందా? అని సందేహించాను కూడా. కట్ చేస్తే సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లో సుమారు ఏడు కోట్ల 25 లక్షల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. ఒకవేళ ప్రస్తుత లెక్కలతో పోలిస్తే ‘బాహుబలి 2’ని దాటేస్తుందని ట్రేడ్ చెబుతోంది. ‘‘అఅఆ’ సినిమా ముంబైలో 25 థియేటర్స్‌లో దాదాపు 25 వారాల పాటు ఆడింది. ఇంకా ఆడుతోంది’’ అని అప్పట్లో బయ్యర్లు నాతో అన్నారు. ఇప్పుడు అలాంటివి జరగడం లేదు. ఆ రోజులు పోయాయి’’ అన్నారు అమితాబ్. -
శ్రీనువైట్లకు హీరో దొరికాడా!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ఇటీవల ఆ ఫాం కోల్పోయాడు. ఆగడు సినిమా నుంచి వరుస ఫ్లాప్‌లు ఎదురు కావటంతో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు హీరోలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. తాజాగా అమర్ అక్బర్ ఆంటొనితో మరో ఫ్లాన్ ఎదురుకావటంతో శ్రీనువైట్లకు నెక్ట్స్ ఏ హీరో చాన్స్ ఇస్తాడన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. మంచు ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు కామెడీ సినిమాలతో సూపర్హిట్లు సాధించాడు. ఇటీవల కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనకు ఢీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా ఢీకి సీక్వల్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ సినిమాతో అయిన శ్రీనువైట్ల హిట్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. -
మాస్ మహారాజ్ బర్త్‌డే గిఫ్ట్!
రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా కొట్టడంతో తదుపరిచిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న రవితేజ రిపబ్లిక్ రోజున అభిమానులకు ఓ గిప్ట్ ఇవ్వనున్నాడు. అదే రోజు రవితేజ పుట్టినరోజు కూడా కావటంతో తన తాజా చిత్రం టైటిల్ లోగోలను రిలీజ్ చేయనున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తుండగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. -
రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చిన ఇలియానా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌కు క్రేజీ హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. దీంతో తాజాగా టాలీవుడ్లో అమర్ అక్బర్ ఆంటొని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాను సంప్రదించారట. అయితే ఒక్క పాటకు ఇలియానా అడిగిన పారితోషికం విని చిత్రయూనిట్ షాక్ అయ్యింది. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఇలియానా ఏకంగా 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసారట. మరి VVR టీం అంత ఇచ్చి ఇలియానానే తీసుకుంటారా..? లేక మరో హీరోయిన్ను ట్రై చేస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీ రివ్యూ
టైటిల్ : అమర్ అక్బర్ ఆంటొని జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రవితేజ, ఇలియానా, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, విక్రమ్‌జిత్ విర్క్, సునీల్ సంగీతం : ఎస్. తమన్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి రాజా ది గ్రేట్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, చాలా కాలంగా సక్సెస్ లేక కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అమర్ అక్బర్ ఆంటొని. ఈ సినిమాతో చాలా కాలం తరువాత గోవా బ్యూటి ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై హీరో, హీరోయిన్, దర్శకుడు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అమర్ అక్బర్ ఆంటొని.. ఆ అంచనాలను అందుకుందా..? రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? ఇలియానా రీ ఎంట్రీలో ఎంత మేరకు ఆకట్టుకుంది.? కథ ; ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్ అరోరా), సబూ మీనన్ (ఆదిత్య మీనన్), విక్రమ్ తల్వార్ (విక్రమ్‌జీత్) , రాజ్ వీర్ల నిజస్వరూపం తెలియని ఆనంద్, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్ అయిన వెంటనే ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్(షాయాజీ షిండే) సాయంతో అమర్, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్ అవుట్ అయినా సహజంగా అనిపించదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇలియాన నటన అలరిస్తుంది. కాస్త బొద్దుగా కనిపించినా పర్ఫామెన్స్తో పాటు గ్లామర్‌తోనూ మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, విక్రమ్‌జీత్ విర్క్ స్టైలిష్ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్, జయప్రకాష్ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ కలర్ఫుల్గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ ; రవితేజ నటన ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్ ; పాత కథ ఫోర్స్డ్ కామెడీ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కథతో పాటే కామెడీ
రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని హాస్యనటులతో పాటు చిత్రదర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంటి మిరియాల. దర్శకుడు శ్రీనుగారు తన ప్రతి సినిమాలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశాను. ఓ కమెడియన్ రోల్‌ని స్టార్టింగ్ టు ఎండింగ్ డిజైన్ చేసే డైరెక్టర్స్‌లో శ్రీనుగారు ఒకరు’’ అన్నారు. నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ‘వాటా’ (హోల్ ఆంధ్రా, తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్) లో మేమందరం చేసే అల్లరి మామూలుగా ఉండదు. ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేస్తూ చే శాం. రఘుబాబుగారిని విపరీతంగా టీజ్ చేసే క్యారెక్టర్ నాది. శ్రీను వైట్లగారు ప్రతి సినిమాలో మమ్మల్ని పెట్టుకుని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని చేతన్ శర్మ పాత్ర ద్వారా నా కెరీర్ మరో లేయర్లోకి వెళ్లే పాత్ర ఇది. ‘వెన్నెల’ కిశోర్‌గారి అసిస్టెంట్ పాత్ర నాది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘ఈ కామెడీ గ్యాంగ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో సునీల్ జాయినవుతాడు. అతని పేరు బేబీ సిట్టర్ బాబి. ఆ పాత్ర ద్వారా ఆయన ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తారు. ఈ కామెడీ పాత్రలన్నీ కథలో కలిసి ఉంటాయి. సెపరేట్ ట్రాక్‌లు కాదు. మొదటినుంచి చివరివరకు ఈ పాత్రలన్నీ సినిమాలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఇంత బాగా కామెడీ సెట్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు
48 అవర్స్‌లో తెలుస్తుంది... కొన్ని ప్రశ్నలకు రవితేజ చెప్పిన సమాధానం ఇది. ఇంతకీ 48 గంటల కహానీ ఏంటీ అంటే.. ‘ఈ సినిమాలో మీరు మూడు క్యారెక్టర్స్ చేశారట కదా’ అంటే.. దానికి సమాధానం 48 అవర్స్. శ్రీను వైట్లతో చాలా గ్యాప్ తర్వాత సినిమా చేశారు కదా? ఈ సినిమా కూడా హిట్ అవుతుందా? అంటే.. 48 అవర్స్. మీ క్యారెక్టర్లో ‘స్లి్పట్ పర్సనాల్టీ’ ఉంటుందా? అనడిగితే.. 48 అవర్స్... శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, ఇలియానా జంటగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడినప్పుడు రవితేజ దాటేయాలనుకున్న ప్రశ్నలకు ‘48 అవర్స్’ అని సింపుల్‌గా చెప్పారు. రవితేజ చెప్పిన మరిన్ని విశేషాలు... ► ఒక హిట్ వస్తే సూపర్ అని, ఫ్లాప్ వస్తే కాదని కాదు. ఒక ఫ్లాప్ ఇచ్చినవాళ్లు సూపర్‌హిట్ ఇవ్వొచ్చు. బ్లాక్‌బస్టర్ ఇచ్చినవాళ్లు ఫ్లాప్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమా బాగా ఆడాలనే చేస్తాం. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. మరికొన్ని నచ్చవు.. అంతే. ఫ్లాప్ అయిన సినిమా గురించి ఆలోచిస్తాను కానీ సీరియస్‌గా తీసుకోను. నెక్ట్స్ ఏంటీ? అనే విషయం పై మరింత ఫోకస్ పెడతా. ► ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశానా? లేక ఒకే పాత్రలో స్పిల్ట్ పర్సనాలిటీస్ ఉంటాయా? అన్న విషయాలను వెండితెరపై చూపిస్తాం. ఇంటెన్స్ అండ్ ఎమోషన్ ఉన్న అమర్ పాత్రంటే పర్సనల్‌గా ఇష్టం నాకు. అక్బర్, ఆంటొని పాత్రలు కాస్త హాస్యభరితంగా ఉంటాయి. ► ఒక నటుడికి రెండు కన్నా ఎక్కువ షేడ్స్ ఉన్న పాత్రలు వచ్చినప్పుడు చాలెంజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా నాకు అలాగే అనిపించింది. ఈ సినిమాలో నటన పరంగా సంతృప్తి చెందాను. ఇక ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఇంతకు ముందు శ్రీను వైట్ల, నా కాంబినేషన్లో ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాలు వచ్చాయి. కానీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా స్క్రిప్ట్ ఇద్దరికీ కొత్తే. ‘నీ కోసం’ ఒక లవ్‌స్టోరీ. ‘దుబాయ్ శీను, వెంకీ’ చిత్రాల్లో బాగా అల్లరి ఉంది. ఈ సినిమాలో అల్లరితో పాటు ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రతి కథలోనూ చిన్న చిన్న డౌట్స్ ఉంటూనే ఉంటాయి. శ్రీను వైట్ల కథ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ చెప్పాను. క్లారిఫై చేశారు. ఆయన గత సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ ఈ సినిమాలో జరగవని నా స్ట్రాంగ్ ఫీలింగ్. టైమ్ తీసుకుని బాగా ఫోకస్‌తో చేశాడు. ► ఈ సినిమాలో స్పూఫ్‌లు లేవు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో లయ, అభిరామ్ స్నేహితులుగా కనిపిస్తారు. నా చిన్నప్పటి పాత్రను నా కొడుకు మహాధన్ చేయాలి. స్కూలు, డేట్స్ కుదరక చేయలేదు. ‘దుబాయ్ శీను’లోలా సునీల్ బాగా నవ్విస్తాడు. కమెడియన్ సత్య పాత్ర ఓ హైలైట్. ఇలియానా మంచి ఆర్టిస్టు. ఈ సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తమన్ మంచి సంగీత దర్శకుడు. చక్కని పాటలిచ్చాడు. ► ఇంతకుముందు డిఫరెంట్‌గా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, నేనింతే, శంభో శివ శంభో’లాంటి మంచి సినిమాలు చేశాను. ఆడలేదు. కానీ డిఫరెంట్ జానర్ సినిమాలు ట్రై చేయడం మానను. భవిష్యత్‌లో మళ్లీ ప్రయత్నిస్తాను. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలూ చేస్తా. అసలు నేను ఇది చేయను, అది చేయను అని ఎప్పుడూ చెప్పను. నచ్చితే అన్ని రకాల పాత్రలూ చేస్తాను. హాలీవుడ్ మూవీ ‘టేకెన్’ అంటే ఇష్టం. అలాంటి సినిమా చేయాలని ఉంది. ► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటమే నా ఉత్సాహానికి కారణం. నెగిటివిటీ, డిప్రెషన్, స్ట్రెస్ వంటి వాటిని పక్కన పెడితే అందరూ ఉత్సాహంగానే ఉంటారు. రాజకీయాల గురించి చదవను. అంతగా తెలీదు. ‘మీటూ’ వల్ల ఇండస్ట్రీల్లో కాస్త కుదురు వచ్చినట్లుంది. ► మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో కానీ, ఎస్ఆర్టి నిర్మాతతో కానీ మూడు సినిమాల డీల్ అనే వార్తల్లో నిజం లేదు. నాకు కంఫర్ట్‌గా అనిపించింది. చేస్తున్నాను. నా గురించి తెలిసిన వాళ్లందరూ నా సినిమాల గురించి ఓపెన్‌గా చెబుతారు. ఎవరో ఎందుకు మా అబ్బాయి మహాధన్ కూడా తన ఒపీనియన్‌ను ఓపెన్‌గా చెబుతాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యా. ‘తేరీ’ రీమేక్ చేయడం లేదు. సంతోష్ శ్రీనివాస్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా ఉంటుంది. కానీ అన్నీ కుదరాలి. నాకు టైమ్ దొరికితే నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. వెబ్ సిరీస్‌లో నేను నటించడం గురించి త్వరలో చెబుతాను’’ అంటున్న రవితేజతో ‘మీకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?’ అని అడిగితే – ‘‘ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. అలాంటి వార్త ఏదైనా వస్తే... నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు’’ అన్నారు. -
ఏ హీరోను, నిర్మాతనూ ఇబ్బంది పెట్టలేదు!
‘‘నా కెరీర్లో ఏం జరిగినా అది నా బాధ్యతే. మంచైనా.. చెడైనా. నాది సింపుల్ లివింగ్ స్టైల్. సినిమా అంటే నాకు పిచ్చి ఉంది కానీ కీర్తి కాంక్ష లేదు. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లేరే అని బాధపడే మనస్తత్వం కాదు నాది. ఇప్పటివరకు నాతో సినిమా చేయమని ఏ హీరోను, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు’’ అన్నారు శ్రీను వైట్ల. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయికగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు. ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఒక పాయింట్ బేస్డ్ సినిమా. అందుకే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. రవితేజతో నేను చేసిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాల్లో లేనటువంటి బలమైన కథ ఈ సినిమాలో బోనస్‌గా ఉంటుంది. మేజర్ షూటింగ్ న్యూయార్క్‌లో చేశాం. నన్ను, కథను అర్థం చేసుకుని ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. మూవీ జర్నీ బాగుంటే ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను చాలా లగ్జరీగా తీశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాకు బడ్జెట్ హద్దులు దాటలేదు. నిర్మాతలు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని బడ్జెట్‌ను పెంచే మనస్తత్వం నాది కాదు. రవితేజ మంచి పొటెన్షియల్ అండ్ ఇంటెన్స్ యాక్టర్. ఆయనకు సినిమాలంటే పిచ్చి. నాలోని డైరెక్టర్ని రవితేజ బాగా నమ్ముతారు. ఇంతకుముందు ఉన్న కమిట్స్‌మెంట్స్ కారణంగానే రవితో మళ్లీ సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ఇలియానాను కథానాయికగా తీసుకోవాలనుకునే ఆలోచన నాదే. సునీల్ మంచి క్యారెక్టర్ చేశారు. రవితేజ చిన్నప్పటి పాత్రకు ముందుగా ఆయన కుమారుడు మహాధన్‌ను అనుకున్నాం కానీ వర్క్ పర్మిట్ లేట్ అవ్వడం వల్ల కుదర్లేదు. అలాగే లయగారు, అభిరామిగారు బాగా చేశారు. కథకు కరెక్ట్‌గా సరిపోతుందనే ‘అమర్ అక్బర్ ఆంటొని’ టైటిల్ పెట్టాం. సినిమాలో రివెంజ్ బ్యాక్‌డ్రాప్ ఒక పార్ట్ మాత్రమే. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఆలస్యం అవడం వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘తానా’ మీద ఈ సినిమాలో సెటైర్స్ వేయలేదు. తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనే మాట నిజం. నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంపై రియలైజ్ అయ్యాను. నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం అంతకు మించి పని చేశాను. నేను ‘డౌన్’లో ఉన్నప్పుడు కూడా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం ఐదుగురు ప్రొడ్యూసర్స్ పోటీ పడ్డారు. మైత్రీని చూజ్ చేసుకున్నాం. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదు. చిన్న సినిమాల నుంచే పెద్ద డైరెక్టర్‌గా ఎదిగాను. నా తొలి సినిమా బడ్జెట్ 38 లక్షలు. కెరీర్లో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఒక బ్రాండ్ వచ్చింది. అదే శాపం, వరం కూడా. కొత్త కథను చెప్పడం కష్టం కాదు. అందులో నా మార్క్ మిస్ అవ్వకుండా ఎంటర్టైనింగ్గా చెప్పడం చాలా కష్టమైన విషయం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మహేశ్, నేను సినిమా చేయాలనుకుంటే చేస్తాం. నెక్ట్స్ ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాను. బాలీవుడ్లో సినిమాలు చేయాలని నాకూ ఉంది. ‘ఢీ, దూకుడు’ సినిమాలను బాలీవుడ్లో చేయాల్సింది. కుదర్లేదు. ఈ సినిమాతో కుదురుతుందేమో చూడాలి. -
‘చెడు ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’
మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఈ సినిమా థియరిటికల్ ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది మూవీ యూనిట్. ‘శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారు కొందరు ఉంటే శక్తి మేరకు నయవంచన చేసేవారు కోకొల్లలు, చెడ్డవాళ్ల నుంచి చెడు ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’ వంటి శ్రీను వైట్ల మార్కు డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అమర్ పాత్రలో సీరియస్‌గా కనిపించిన రవితేజ... డాక్టర్ ఆంటొనిగా సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులతో కలిసి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఇక హీరోయిన్ ఇలియానా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. కాగా లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 16న విడుదల చేయనున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరోయిన్ ఇలియానాకు రవితేజతో ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. శ్రీను వైట్ల- రవితేజ కాంబినేషన్లో గతంలో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు రాగా, రవితేజ- ఇలియానా హీరోహీరోయిన్లుగా ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. -
‘అఅఆ’లో డాన్‌బాస్కో కాస్తా.. డాన్‌బ్రాస్కోగా మారింది!
సినిమాలోని పాటల్లో, మాటల్లో కొన్ని పదాలు వాడటంతో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో ఇలా ఎన్నో పాటలు, మాటలు సినిమాల్లోంచి తీసేయడమో లేదా వాటిని మార్చడమో జరగుతూ వచ్చాయి. అదుర్స్, రంగస్థలం పాటలే ఇందుకు ఉదాహరణ. ఆ సినిమాలోని పాటలు కొందరి మనోభావాలు దెబ్బతినడంతో వాటి లిరిక్స్‌ను మార్చేశారు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘అమర్‌అక్బర్‌ఆంటోని’లోని డాన్‌బాస్కో పాటలోని పదాన్నికూడా మార్చబోతున్నట్లు ప్రకటించారు. డాన్‌బాస్కో అనే మత గురువు పేరిట ఉన్న డాన్‌బాస్కో సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు.. ఆ పదాన్ని మార్చుతూ.. డాన్‌బ్రాస్కోగా కొత్త లిరిక్‌తో సాంగ్ వస్తుందంటూ మేకర్స్ తెలిపారు. ఇలియాన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది. #DonBosco becomes #DonBrasco Respecting the sentiments of Don Bosco Seva Kendra, the producers have changed the lyrics of the song@RaviTeja_offl @SreenuVaitla @Ileana_Official @MusicThaman @MythriOfficial @Mee_Sunil @vennelakishore #AAAOnNov16 — BARaju (@baraju_SuperHit) November 12, 2018 -
చెప్పాలనుకుంటే చెబుతా
‘‘ఇన్ని సంవత్సరాలు తెలుగులో కావాలని గ్యాప్ తీసుకోలేదు. బాలీవుడ్‌కి వెళ్లాక వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా కంటిన్యూ అయిపోయాను. ఈలోపు నేను కావాలనే తెలుగుకి దూరంగా ఉంటున్నానని మిస్అండర్స్టాడింగ్ చేసుకున్నారు. ఏదేదో అనుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌ని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ బ్యాలెన్స్ మిస్ అయింది (నవ్వుతూ)’’ అని ఇలియానా అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను ౖÐð ట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇలియానా మళ్లీ తెలుగులో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా మీడియాతో ఇలియానా పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమా ఒప్పుకోవడానికి మొదటి కారణం కథ. వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను. అలాగే రవితేజ కూడా ఉన్నారు. రవి నా ఫేవరెట్ కో–స్టార్. ఇద్దరం కలసి ఆల్రెడీ మూడు సినిమాలు చేశాం. ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. నా పాత్ర పేరు చెప్పినా కూడా సినిమాలో క్లూ చెప్పేసినట్టే అవుతుంది. ► ఈ మధ్యలో కూడా కొన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయి. స్క్రిప్ట్స్ కుదరక మిస్ అయ్యాయి. సాంగ్స్ చేయాలంటే అది ఆ సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాను. అంత స్పెషల్‌గా ఉండదనిపించి వదిలేశాను. ఇటీవల ఓ పెద్ద సినిమా కూడా వదిలేశా. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్ ఉన్నా నా పాత్ర చాలా చిన్నదిగా ఉండడంతో చేయలేదు. ► ‘దేవదాసు’తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వయసు 17,18. ఏ సినిమా వచ్చినా చేసేశాను. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచన తీరు కూడా పెరుగుతుంది. మనం చేస్తున్న వృత్తి పట్ల ఇంకా గౌరవంగా ఉంటాం. మంచి సినిమాలు చేయాలనుకుంటాం. ప్రస్తుతానికి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాను. డ్రీమ్‌రోల్స్ లాంటివి పెద్దగా ఏం లేవు. యువరాణిలా చేయాలి, యోధురాలిగా కత్తి విద్యలు చేయాలి అని పెద్దగా అనుకోను. నా దర్శకులు అలాంటి పాత్ర చేయిస్తే చేస్తానేమో. ► నా కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవడమే. ‘పోకిరి’ సినిమా సమయంలో అనుకుంటా... ఆ సినిమా చేయాలా వద్దా అనుకున్నాను. మహేశ్ సోదరి మంజుల చేయమని చెప్పారు. ఆవిడ చెప్పకపోతే నా కెరీర్లో నిజంగా ఓ స్పెషల్ ఫిల్మ్ మిస్ అయ్యుండేదాన్ని. ► ‘అమర్ అక్బర్..’ సినిమాలో నా పాత్రకు స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటానని అనుకోలేదు. శ్రీనుగారు బావుంటుందని చెప్పించారు. డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి చెప్పేవరకూ నమ్మకం కుదర్లేదు. నేను డబ్బింగ్ చెప్పడం ఏంటీ? అని. ఎందుకంటే తెలుగు భాష స్పష్టంగా పలకకపోతే పాత్ర దెబ్బ తింటుంది. నా వాయిస్ నాకు నచ్చలేదు. (నవ్వుతూ). ► నేను నటిని. సెట్లో నటిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అందరిలాగానే నార్మల్‌గా ఉంటా. వండుకోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ పర్సనల్ లైఫ్ పర్సనల్‌గా ఉంటేనే బావుంటుంది అని అనుకుంటున్నాను. అది కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటే చెబుతాను.. అలాగే మొత్తం చెప్పను (నవ్వుతూ). ► ప్రస్తుతం మానసిక ఆరోగ్యం గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. కానీ కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను. యాంగై్జటీ, డిప్రెషన్లోకి వెళ్లడం ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కాదు. సో.. అందరూ ఈ మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి. ► ‘మీటూ’ గురించి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు చెబుతున్నారు. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ ఉద్యమం కచ్చితంగా ఓ మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటున్న ఇలియానాతో మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా? అని అడగ్గా – ‘‘ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాను’’ అన్నారు. పోనీ మీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటీ? అని అడిగితే – ‘‘ ప్రస్తుతానికి మా రిలేషన్షిప్ స్టేటస్ హ్యాపీ’’ అని చెప్పారు. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ ప్రీరిలీజ్ వేడుక
-
శ్రీను వైట్ల గొప్ప నటుడు
‘‘శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మా కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్ చిత్రం ‘నీకోసం’ కొంచెం ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘వెంకీ, దుబాయ్ శీను’ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటి కలయిక ‘అమర్ అక్బర్ ఆంటొని’. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’కి డబ్బింగ్ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవీన్, రవి, మోహన్గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్ హౌస్ ఇది. ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్ డార్లింగ్. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఈ సినిమాలోని అందరి పాత్రల్లో శ్రీను కనిపిస్తారు.. ఇలియానాలో కూడా (నవ్వుతూ)’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’ కథని నేను, వంశీ రెండు నెలలు వర్కవుట్ చేసి, ఓ షేప్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రవీణ్, మరో అబ్బాయి ప్రవీణ్ జాయిన్ అయ్యి రచనా సహకారం అందించారు. మేం నలుగురం 8 నెలలు కష్టపడి స్క్రిప్ట్ పూర్తి చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్ మేకింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. ఈ ప్రయాణం బాగుంది. ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, పెద్ద హిట్ చేస్తారని 100 శాతం నాకు నమ్మకం ఉంది. రవితేజ నా ట్రబుల్ షూటర్. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇచ్చి మళ్లీ పైకి తీసుకొస్తుంటాడు. అలా ‘వెంకీ’ అప్పుడు, ‘దుబాయ్ శీను’ అప్పుడు చేశాడు.. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటొని’కి చేశాడు. తనకి నామీద ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్యూ రవి. తను ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా. మేం రాసుకున్న కథని అలాగే తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది. రెండు షెడ్యూల్స్ అమెరికాలో చేసినా నిర్మాతలు నాకు బాగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్. వెంకట్ సి.దిలీప్ మంచి విజువల్స్ ఇచ్చాడు. తమన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇలియానాతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా.. ఇప్పటికి కుదిరింది. నేను ఫోన్ చేయగానే నటించేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మంచి నటి. తనతో నేను కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. కష్టపడి డబ్బింగ్ చెప్పినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్ యూ. ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్ ఫ్రెండ్. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారి అభిమానులకు హాయ్. మీరిచ్చే కిక్కే వేరు. 100 సినిమాలు ఎలా చేశానని నాకే తెలీదు. ఇదంతా రవితేజగారు ఇచ్చిన కిక్కే. ఆయన ఇచ్చే ఎనర్జీ నా బండికి పెట్రోల్‌లాగా నడిపిస్తూ ఉంటుంది. ‘పవర్’ సినిమా ఆడియోలో చెప్పాను. ఆయనకు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ అయితే.. నాకు అమ్మా నాన్న రవితేజ. అందులో నిజం ఉంది. మ్యూజిక్ చేయడానికి నాకు ధైర్యం రాలేదు. ‘నువ్వు చేయగలవు.. చేస్తావు’ అంటూ ఆయన ఇచ్చిన కిక్, ధైర్యం, నమ్మకం, బలంవల్లే 100 సినిమాలు చేయగలిగాను. రవితేజగారితో 9 సినిమాలు చేశాను.. ఏ హీరోతోనూ చేయలేదు. శ్రీను వైట్లగారితోనూ 5 సినిమాలు చేశాను. ఈ రోజుకి కూడా ‘దూకుడు’ పాటలు వింటుంటే నేనేనా కంపోజ్ చేసింది అనిపిస్తుంది. అంత ఈజీగా ఆయన నా వద్ద నుంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. మనకు నచ్చిన హీరో, డైరెక్టర్‌తో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడంకంటే అదృష్టం ఏం ఉంటుంది. రవితేజని మాస్ మహారాజా అని పిలవను. ఆయన మనసే మహారాజ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఈ సినిమా చేసినందుకు రవితేజ, శ్రీను వైట్లగార్లకు థ్యాంక్స్. తమన్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఆయనతో పని చేయాలనుకుంటున్నాం. శ్రీను వైట్లగారి గత సినిమాల్లో ఉన్నట్లు చాలామంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. టోటల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీను వైట్లగారు దర్శకునిగానే కాదు.. మా నిర్మాతల రోల్ కూడా తీసుకున్నారు. ఓ మూవీ బడ్జెట్ కంట్రోల్ డైరెక్టర్ చేతిలో ఉంటుందని వంద శాతం నిరూపించారు’’ అన్నారు. చిత్రనిర్మాతలు వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నిర్మాతలు అనీల్ సుంకర, కిరణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్, నటులు గౌతంరాజు, గిరి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వ, పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీ స్టిల్స్
-
గోవా బ్యూటీ తెలుగు పలుకులు
‘దేవదాసు’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు గోవా బ్యూటీ ఇలియానా. ఆమె టాలీవుడ్‌కి వచ్చి 12ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం తొలిసారి తెలుగు పలుకులు పలుకుతున్నారామె. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. ఆరేళ్ల కిందట విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత బాలీవుడ్ వెళ్లిన ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా చేసిన పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల అనుకున్నారు. నాలుగు రోజుల్లోనే ఇలియానా డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సహనిర్మాత: ప్రవీణ్ మార్పురి. -
డేట్ ఫిక్స్
నెక్ట్స్ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేందుకు డేట్ ఫిక్స్ చేశారు రవితేజ. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తారు. ఇందులో ముగ్గరు కథానాయికలు ఉంటారని సమాచారం. ఆల్రెడీ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్‌లను ఎంపిక చేశారు టీమ్. ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్‌ను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నట్లు దీపావళి సందర్భంగా వీఐ ఆనంద్ తెలిపారు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. -
ఇలియానా తొలిసారిగా..!
చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా హీరోయిన్లందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్, తమన్నా, పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్ ఓన్ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అవాయ్ సువాయ్ ఆంటొని
-
తీన్మార్
‘ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఆరేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. 11ఏళ్ల కిందట వచ్చిన ‘దుబాయ్ శీను’ తర్వాత రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మూడు క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. సో.. ఆయన అభిమానులకు తీన్మార్ అన్నమాట. ఈ నెల 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. రెండవ పాటను దీపావళి సందర్భంగా ఈ రోజు విడుదల చేస్తున్నాం’’ అన్నారు. లయ, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి. -
‘అఅఆ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
మాస్ మహరాజా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి కామెడీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ . రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. రెండవ పాటను దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
‘టాక్సీ’ స్పీడుకు ‘అమర్’ బ్రేక్ వేస్తాడా?
‘గీతగోవిందం’తో సక్సెస్ తరువాత వెను వెంటనే ‘నోటా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు నిరాశే మిగిలింది. మాస్ మహారాజ రవితేజ గతకొంతకాలం నుంచి సరైన విజయాలు లేక డీలా పడ్డాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు వచ్చే నెలలో పోటీపడనున్నారు. పలు వాయిదాల అనంతరం విజయ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సీవాలా’ ఎట్టకేలకు నవంబర్ 16న విడుదల కానున్నట్లు ప్రకటించారు. వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటొని కూడా నవంబర్ 16నే వస్తుంది. ఇవి రెండు ఒకే తేదీన విడుదల అవుతున్నందున అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం విజయ్ హవా నడుస్తున్న తరుణంలో టాక్సీవాలాపై అంచనాలు ఉన్నా.. పోస్టర్స్, టీజర్స్‌తో ‘అఅఆ’పై కూడా అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. మరి ఈ రెండింటిలో ప్రేక్షకులను ఏది మెప్పిస్తుందో చూడాలి. -
ముగింపు రాసుకున్న తరువాతే.. టీజర్ అదుర్స్!
వరుసగా ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే అది వారిద్దరికీ పరీక్షే. టాలీవుడ్లో వరుసగా పరాజయాలను చవిచూస్తున్న రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మంచి హిట్లు వచ్చాయి. అయితే మళ్లీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్. ఇలియానా అందాలు కూడా మరో ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. ఈ టీజర్ అంచనాలను పెంచేలా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కానుంది. Here it is! #AAATeaser @SreenuVaitla @MythriOfficial @MusicThaman @Ileana_Officialhttps://t.co/W04MEvfJVz — Ravi Teja (@RaviTeja_offl) October 29, 2018 -
ఏం చేస్తుంటారు?
ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్‌తో ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఎలా ఉంటారో తెలిసింది. మరి ఈ ముగ్గురు ఏం చేస్తుంటారు? ఎలా మాట్లాడతారో చూపించడానికి శాంపిల్‌గా టీజర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు టీమ్. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయిగా నటించారు. బాలీవుడ్‌కి వెళ్లిన ఇలియానా ఈ సినిమాతోనే మళ్లీ సౌత్‌కి తిరిగొస్తున్నారు.‘‘శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన గ్లిమ్స్ ఆఫ్ అమర్ అక్బర్ ఆంటొనికి మంచి స్పందన వచ్చింది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రవితేజ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్, లయ, ‘వెన్నెల’ కిశోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
‘అత్యంత ప్రమాదకర సెలబ్రిటీ ఇలియానా’
అభిమాన తారలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో తారలను ఫాలో అవ్వటంతో పాటు వారికి సంబంధించిన వార్తలకు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. అయితే అలా సెర్చ్ చేసే సమయంలో కొంత మంది తారల గురించి వెతకటం ప్రమాదకరమంటున్నారు ఎక్స్పర్ట్స్. పాపులర్ సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసే సమయంలో మీ కంప్యూటర్లలోకి వైరస్‌లను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో గోవా బ్యూటీ ఇలియానా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇలియానా తరువాతి స్థానాల్లో ప్రీతీ జింటా, టబు, క్రితీ సనన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే లాంటి వారు ఉన్నారు. అయితే టాప్ సెలబ్రిటీలను పక్కన పెట్టి పెద్దగా సినిమా అవకాశాలు లేని ఇలియానా మెస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటొని సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
గుమ్మడికాయ కొట్టేశారు
‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎమ్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్ పూర్తయింది. సోమవారం శ్రీనువైట్ల పుట్టిన రోజు కానుకగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ పాత్రలను పరిచయం చేస్తూ, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ గెటప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. లయ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: పవ్రీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ తమన్.