Amar Akbar Anthony Review, in Telugu | 2018 | ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ మూవీ రివ్యూ | AAA Movie Review - Sakshi
Sakshi News home page

Published Fri, Nov 16 2018 12:21 PM | Last Updated on Fri, Nov 16 2018 12:58 PM

Amar Akbar Antony Telugu Movie Review - Sakshi

టైటిల్ : అమర్‌ అక్బర్‌ ఆంటొని
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : రవితేజ, ఇలియానా, తరుణ్‌ అరోరా, షాయాజీ షిండే, విక్రమ్‌జిత్ విర్క్‌, సునీల్‌
సంగీతం : ఎస్‌. తమన్‌
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాత : నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి
 

రాజా ది గ్రేట్‌ సినిమా తరువాత మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, చాలా కాలంగా సక్సెస్‌ లేక కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అమర్‌ అక్బర్ ఆంటొని. ఈ సినిమాతో చాలా కాలం తరువాత గోవా బ్యూటి ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. మంచి హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమాపై హీరో, హీరోయిన్‌, దర్శకుడు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అమర్‌ అక్బర్‌ ఆంటొని.. ఆ అంచనాలను అందుకుందా..? రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్‌ రిపీట్ చేసిందా..? ఇలియానా రీ ఎంట్రీలో ఎంత మేరకు ఆకట్టుకుంది.?
 

కథ ;
ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో  కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్‌ అరోరా), సబూ మీనన్‌ (ఆదిత్య మీనన్‌), విక్రమ్‌ తల్వార్‌ (విక్రమ్‌జీత్‌) , రాజ్‌ వీర్‌ల నిజస్వరూపం తెలియని ఆనంద్‌, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్‌ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్‌ అయిన వెంటనే ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి  నమ్మకస్తుడైన జలాల్‌ అక్బర్‌(షాయాజీ షిండే) సాయంతో అమర్‌, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్‌ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్‌, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్‌, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్‌ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్‌, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్‌ అవుట్‌ అయినా సహజంగా అనిపించదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇలియాన నటన అలరిస్తుంది. కాస్త బొద్దుగా కనిపించినా పర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్‌తోనూ మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌జీత్‌ విర్క్‌ స్టైలిష్‌ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్‌ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్‌ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ ;
చాలా రోజులుగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్‌ డ్రామా కథకు న్యూయార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. తమన్‌ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
రవితేజ నటన
ప్రొడక్షన్‌ వాల్యూస్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
పాత కథ
ఫోర్స్‌డ్‌ కామెడీ
స్క్రీన్‌ ప్లే


సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement