48 అవర్స్‌లో తెలుస్తుంది... కొన్ని ప్రశ్నలకు రవితేజ చెప్పిన సమాధానం ఇది. ఇంతకీ 48 గంటల కహానీ ఏంటీ అంటే.. ‘ఈ సినిమాలో మీరు మూడు క్యారెక్టర్స్ చేశారట కదా’ అంటే.. దానికి సమాధానం 48 అవర్స్. శ్రీను వైట్లతో చాలా గ్యాప్ తర్వాత సినిమా చేశారు కదా? ఈ సినిమా కూడా హిట్ అవుతుందా? అంటే.. 48 అవర్స్. మీ క్యారెక్టర్‌లో ‘స్లి్పట్ పర్సనాల్టీ’ ఉంటుందా? అనడిగితే.. 48 అవర్స్... శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, ఇలియానా జంటగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడినప్పుడు రవితేజ దాటేయాలనుకున్న ప్రశ్నలకు ‘48 అవర్స్’ అని సింపుల్‌గా చెప్పారు. రవితేజ చెప్పిన మరిన్ని విశేషాలు...
► ఒక హిట్ వస్తే సూపర్ అని, ఫ్లాప్ వస్తే కాదని కాదు. ఒక ఫ్లాప్ ఇచ్చినవాళ్లు సూపర్‌హిట్ ఇవ్వొచ్చు. బ్లాక్‌బస్టర్ ఇచ్చినవాళ్లు ఫ్లాప్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమా బాగా ఆడాలనే చేస్తాం. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. మరికొన్ని నచ్చవు.. అంతే. ఫ్లాప్ అయిన సినిమా గురించి ఆలోచిస్తాను కానీ సీరియస్‌గా తీసుకోను. నెక్ట్స్ ఏంటీ? అనే విషయం పై మరింత ఫోకస్ పెడతా.
► ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశానా? లేక ఒకే పాత్రలో స్పిల్ట్ పర్సనాలిటీస్ ఉంటాయా? అన్న విషయాలను వెండితెరపై చూపిస్తాం. ఇంటెన్స్ అండ్ ఎమోషన్ ఉన్న అమర్ పాత్రంటే పర్సనల్‌గా ఇష్టం నాకు. అక్బర్, ఆంటొని పాత్రలు కాస్త హాస్యభరితంగా ఉంటాయి.
► ఒక నటుడికి రెండు కన్నా ఎక్కువ షేడ్స్ ఉన్న పాత్రలు వచ్చినప్పుడు చాలెంజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా నాకు అలాగే అనిపించింది. ఈ సినిమాలో నటన పరంగా సంతృప్తి చెందాను. ఇక ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఇంతకు ముందు శ్రీను వైట్ల, నా కాంబినేషన్‌లో ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాలు వచ్చాయి. కానీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా స్క్రిప్ట్ ఇద్దరికీ కొత్తే. ‘నీ కోసం’ ఒక లవ్‌స్టోరీ. ‘దుబాయ్ శీను, వెంకీ’ చిత్రాల్లో బాగా అల్లరి ఉంది. ఈ సినిమాలో అల్లరితో పాటు ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రతి కథలోనూ చిన్న చిన్న డౌట్స్ ఉంటూనే ఉంటాయి. శ్రీను వైట్ల కథ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ చెప్పాను. క్లారిఫై చేశారు. ఆయన గత సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ ఈ సినిమాలో జరగవని నా స్ట్రాంగ్ ఫీలింగ్. టైమ్ తీసుకుని బాగా ఫోకస్‌తో చేశాడు.
► ఈ సినిమాలో స్పూఫ్‌లు లేవు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో లయ, అభిరామ్ స్నేహితులుగా కనిపిస్తారు. నా చిన్నప్పటి పాత్రను నా కొడుకు మహాధన్ చేయాలి. స్కూలు, డేట్స్ కుదరక చేయలేదు. ‘దుబాయ్ శీను’లోలా సునీల్ బాగా నవ్విస్తాడు. కమెడియన్ సత్య పాత్ర ఓ హైలైట్. ఇలియానా మంచి ఆర్టిస్టు. ఈ సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తమన్ మంచి సంగీత దర్శకుడు. చక్కని పాటలిచ్చాడు.
► ఇంతకుముందు డిఫరెంట్‌గా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, నేనింతే, శంభో శివ శంభో’లాంటి మంచి సినిమాలు చేశాను. ఆడలేదు. కానీ డిఫరెంట్ జానర్ సినిమాలు ట్రై చేయడం మానను. భవిష్యత్‌లో మళ్లీ ప్రయత్నిస్తాను. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలూ చేస్తా. అసలు నేను ఇది చేయను, అది చేయను అని ఎప్పుడూ చెప్పను. నచ్చితే అన్ని రకాల పాత్రలూ చేస్తాను. హాలీవుడ్ మూవీ ‘టేకెన్’ అంటే ఇష్టం. అలాంటి సినిమా చేయాలని ఉంది.
► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటమే నా ఉత్సాహానికి కారణం. నెగిటివిటీ, డిప్రెషన్, స్ట్రెస్ వంటి వాటిని పక్కన పెడితే అందరూ ఉత్సాహంగానే ఉంటారు. రాజకీయాల గురించి చదవను. అంతగా తెలీదు. ‘మీటూ’ వల్ల ఇండస్ట్రీల్లో కాస్త కుదురు వచ్చినట్లుంది.
► మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో కానీ, ఎస్‌ఆర్‌టి నిర్మాతతో కానీ మూడు సినిమాల డీల్ అనే వార్తల్లో నిజం లేదు. నాకు కంఫర్ట్‌గా అనిపించింది. చేస్తున్నాను. నా గురించి తెలిసిన వాళ్లందరూ నా సినిమాల గురించి ఓపెన్‌గా చెబుతారు. ఎవరో ఎందుకు మా అబ్బాయి మహాధన్ కూడా తన ఒపీనియన్‌ను ఓపెన్‌గా చెబుతాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యా. ‘తేరీ’ రీమేక్ చేయడం లేదు. సంతోష్ శ్రీనివాస్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా ఉంటుంది. కానీ అన్నీ కుదరాలి. నాకు టైమ్ దొరికితే నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. వెబ్ సిరీస్‌లో నేను నటించడం గురించి త్వరలో చెబుతాను’’ అంటున్న రవితేజతో ‘మీకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?’ అని అడిగితే – ‘‘ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. అలాంటి వార్త ఏదైనా వస్తే... నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు’’ అన్నారు.
నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు
Published Thu, Nov 15 2018 1:47 AM | Last Updated on Thu, Nov 15 2018 12:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment