కేఆర్, రాజేష్, బేబి షామిలి, నాగశౌర్య, వీవీ వినాయక్, సుందర్ సూర్య
‘‘కొన్ని రోజుల క్రితం ‘అమ్మమ్మగారిల్లు’ యాడ్ చూడగానే నా బాల్యంలోని మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. మేమంతా వేసవి సెలవులకు వెళ్లినప్పుడు అక్కడ ఆడుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజంతా నేను చాలా మంచి ఫీలింగ్‌లో ఉండిపోయాను. అలాంటి ఫీలింగ్ ఇచ్చినందుకు యూనిట్‌కి థ్యాంక్స్. ‘అమ్మమ్మగారిల్లు’ మంచి హిట్‌తో పాటు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’.
స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అమ్మమ్మగారిల్లు’ ఒక గుడిలాంటిది. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు ఎదురైనా తగాదాలు పడం. అలాగే అమ్మమ్మగారి ఇంటికెళ్లినప్పుడు కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలున్నా అమ్మమ్మ బాధపడకూడదని బయటికి నవ్వుతూ ఉంటాం. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. దయచేసి ఎవరూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలతో ఈ సినిమా చేశా. నాగశౌర్య లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాత్ర కన్నీరు పెట్టిస్తుంది. మా నిర్మాతలు చక్రపాణి–నాగిరెడ్డిగార్లలా కలిసి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత రాజేష్. సహ నిర్మాత కుమార్, ఛాయాగ్రాహకుడు రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment