అమృతా రావ్
దాదాదాపు 12 ఏళ్ల క్రితం మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాతో తెలుగు తెరపై కనిపించారు ముంబై బ్యూటీ అమృతా రావ్. ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కొన్ని హిందీ సినిమాలు చేశారామె. 2013 తర్వాత హిందీ సినిమాల్లో కూడా నటించలేదు. ఆరేళ్ల విరామం తర్వాత ఆమె ఈ ఏడాది గత నెల ‘థాక్రే’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘అతిథి’ తర్వాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారామె. ‘‘అతిథి’ నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌గా మిలిగింది. ఆ సినిమాలో మహేశ్‌బాబు పాత్రకు సమానంగా నా పాత్ర ఉంది. ఆ సినిమా లొకేషన్‌లో నాతో మహేశ్‌బాబు, నమ్రత ఫ్యామిలీ మెంబర్స్‌లా ఉండేవారు.
వారి ఇంటి భోజనం కూడా తిన్నాను. ‘అతిథి’ తర్వాత నాకు 30 రోజుల వ్యవధిలో మూడు అవకాశాలు వచ్చాయి. కానీ నేనే వద్దనుకున్నాను. టాలీవుడ్‌లో కథానాయిక పాత్రలు గ్లామర్ కోసమే అనిపించింది. దక్షిణాది సినిమాలు చేసేది తొందరగా డబ్బు సంపాదించుకోవడం కోసమే అని నాతో కొందరు అన్నారు. తెలుగు డైలాగ్స్ పలకడం కోసం పెద్దగా ఇబ్బంది పడవద్దని, సులభంగానే డబ్బింగ్ చెప్పించేయొచ్చని అని కూడా అన్నారు. కానీ నా వర్కింగ్ స్టైల్ అది కాదు. నటనకు సంబంధించి నా దృష్టిలో డబ్బు ముఖ్యం కాదు’’ అన్నారు అమృతా రావ్. హిందీలో గత ఆరేళ్లల్లో నచ్చిన పాత్రలు రాకపోవడంవల్లే చేయలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment