
బుల్లితెరపై యాంకర్‌గా స్టార్ ఇమేజ్ అందుకున్న అనసూయ, వెండితెర మీద కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే క్షణం, సొగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలో రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేష్‌లో రూపొందుతున్న రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో అనసూయ, చరణ్ అత్త పాత్రలో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ టాక్ పై స్పందించిన అనసూయ, ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనసూయ.. రంగస్థలం సినిమాలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చింది. అయితే అత్త పాత్రలో చేయటం లేదని చెప్పినా.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. రంగస్థలంతో పాటు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలోనూ కీలకపాత్రలో నటిస్తోంది.