అందం, అభినయాల ఆల్‌రౌండర్‌! | Anchor Kowmudi Special Interview | Sakshi
Sakshi News home page

కళా కౌముది !

Published Fri, Jun 15 2018 11:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Anchor Kowmudi Special Interview - Sakshi

శ్రీనగర్‌కాలనీ : కళా వినీలాకాశంలో కౌముది వెలుగు తళుకులీనుతోంది. అందం, అభినయాల కలబోతతో నటనా కౌశలం ద్విగుణీకృతమవుతోంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్రతో దూసుకుపోతోంది. కర్ణాటక సంగీతంలోనే కాకుండాగాయనిగా, యాంకర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎంతో మంది మన్ననలు పొంది ప్రస్తుతం యాక్టర్‌గా రాణిస్తోంది కౌముది నేమాని. భరత్‌ అనే నేను, ఉన్నది ఒక్కటే జిందగీ, నేలటికెట్‌ తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. హైదరాబాద్‌ ఎంతో కంఫర్ట్‌తో పాటు చాలా ఫ్రీడం ఉన్న సిటీ అని ఆమె చెబుతోంది. తెలుగులో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయాలన్నది తన చిరకాల ఆకాంక్ష అని, సిటీతో తనకున్న అనుబంధం, తన జర్నీపై ఆమె వివరించిందిలా.. 

మాది విజయనగరం. చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడే ఇంటర్, విల్లామేరి కాలేజ్‌లో మాస్‌కమ్యూనికేషన్స్‌ జర్నలిజం చేశాను. సంగీతంలో రామాచారి మాస్టర్‌ వద్ద లైట్‌ మ్యూజిక్, శేషులత, లక్ష్మీ, డీవీ మోహనకృష్ణ మాస్టర్స్‌ వద్ద కర్ణాటక మ్యూజిక్‌లో ప్రావీణ్యం పొందాను. ప్రస్తుతం ఇన్ఫినిటమ్‌ అనే సంస్థలో ఫిలిం అండ్‌ మీడియా డెవలపర్‌గా పనిచేస్తున్నాను.

ఎస్‌వీబీసీలో ఛానల్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..  
ప్రఖ్యాత తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నడుస్తున్న టీటీడీ ఎస్‌వీబీసీ ఛానల్‌లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. దైవభక్తితో చేసిన ఈ ప్రోగ్రాం నేను మరువలేనిది. ఆ తర్వాత లైవ్‌ మ్యూజిక్‌లో సింగర్‌గా చేశాను. టీవీ ప్రోగ్రామ్స్‌ కాకుండా ప్రైవేట్‌ లైవ్‌ మ్యూజిక్‌లో ప్రదర్శనలను ఇచ్చాను.



ఇంటర్వ్యూలు.. ప్రమోషన్స్‌
జర్నలిజం చేసిన అనుభవం యాంకరింగ్‌ చేయడానికి తోడ్పడింది. ఐ డ్రీమ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో యాంకరింగ్‌ చేశాను. నాగార్జున, రవితేజ, నాని, రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిధరమ్‌తేజ్, రానా, రామ్‌లాంటి స్టార్‌ హీరోల ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడప్పుడే ఫేస్‌బుక్‌లో ప్రేక్షకులతో లైవ్‌లో మాట్లాడే ప్రోగ్రాం వైరల్‌గా మారింది. అలా ఘాజీ చిత్రానికి రానాతో ఫేస్‌బుక్‌లో లైవ్‌ చేశాం. ఐఫా అవార్డ్స్‌ తెలుగు వర్షన్‌లో పనిచేశాను. 

తొలి చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’  
రారండోయ్‌ వేడుకచూద్దాం చిత్రంలో రకుల్‌కు రూమ్‌మేట్‌గా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత టచ్‌చేసిచూడు, భరత్‌ అనే నేను, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలు చేశాను. రీసెంట్‌గా వచ్చిన నేలటికెట్‌ చిత్రంలో రవితేజ సిస్టర్‌గా ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. గోపీచంద్‌ చిత్రం పంతం చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించాను. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్‌ చిత్రాల్లో మంచి పాత్రలతో పాటు హీరోయిన్‌గా కూడా అవకాశాలు వస్తున్నాయి.   

తెలుగులో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయాలనుంది..
తెలుగులో మ్యూజిక్‌ అల్బమ్స్‌ చేయాలన్నదే నా ఆకాంక్ష. నా పరిధిలో ఇప్పుడున్న సాంకేతికతను దృష్టితో ఉంచుకొని సంగీతప్రియుల ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని మంచి వీడియో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయాలని కోరిక. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. నేటి యువత అంకితభావానికి ప్రాధాన్యతను ఇస్తూ తాము ఎంచుకున్న రంగంలో కొంగొత్త ఆలోచనలతో పనిచేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement