సాక్షి, విజయవాడ : తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారని నిర్మాత యలమంచిలి రవిచంద్ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం అడిగినా... అడగకపోయినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టికెట్స్ రూపంలో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారని, అటువంటి ఆంద్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఉద్యమంపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని రవిచంద్ ప్రశ్నించారు.
సినీ పరిశ్రమలో ఉన్నవారు ప్రత్యేక హోదా కోసం 48 గంటల్లో స్పందించి పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని రవిచంద్ అన్నారు. కాగా రవిచంద్ గతంలో పైరసీకి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్మాతగా ఛార్మి, వేణులతో మాయగాడు, సీతారాముడు చిత్రాలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment