
హిజ్రాగా అంజలి
చాలెంజింగ్ పాత్రల్లో నటించాలని చాలామంది తారలు కోరుకుంటారు. అయితే అలాంటి పాత్రలు ఆశపడిన వారికంతరికీ అమరవు. అదే విధంగా కొన్ని పాత్రలు ధరించడానికి చాలా గట్స్ ఉండాలి. ఈ తరం నటీమణుల్లో అలాంటి దమ్మున్న హీరోయిన్లలో అంజలి ఒకరని చెప్పవచ్చు. అంజలి అంగాడితెరు చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇటీవల తెలుగులో గీతాంజలి చిత్రంలో దెయ్యంగా భయపెట్టారు. తాజాగా హిజ్రాగా తన తడాఖా చూపించడానికి రెడీ అయ్యారు. అంజలికి ఇది అరుదైన అవకాశమే కాదు వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్ అని కూడా అనవచ్చు. కోలీవుడ్‌లో దర్శకుడు రామ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తంగమీన్‌గళ్ చిత్రంతో జాతీయ అవార్డును సాధించిన దర్శకుడీయన.
తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇందులో కథానాయకి పాత్రకు చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లను పరిశీలించినా తన చిత్రంలో నాయకి పాత్రకు అంజలినే పర్‌ఫెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట. ఎందుకంటే ఇందులో మమ్ముట్టి కథానాయకుడు. ఆయనకు ధీటుగా నటించాల్సి ఉంటుందట.
అంజలిది అసాధారణ పాత్ర అట. ఆమెను ఇందులో వేశ్య అయిన హిజ్రాగా చూపించనున్నారని సమాచారం. వేశ్యగా నటించడానికే గట్స్ కావాలి. ఇక హిజ్రా వేశ్య పాత్రకు అభినయించాలంటే ఆషామాషీ విషయం కాదు. ఈ పాత్రలో అంజలిని దర్శకుడు రామ్ ఎలా మలుస్తారో వేచి చూడాల్సిందే. అన్నట్టు ఈ చిత్రానికి పేరన్భు అనే పేరును నిర్ణయించారన్న విషయం తెలిసిందే.