అంజలి లేకపోతే గీతాంజలి లేదు : కోన వెంకట్
‘‘ ‘గీతాంజలి’ కథ అనుకున్నప్పుడు మా కళ్లలో మెదిలిన రూపం అంజలి. ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమా లేదు. అనుకున్నట్లు ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. హారర్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది’’ అని కోన వెంకట్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’. కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజాకిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటునిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే వేదికపై బ్రహ్మానందాన్ని చిత్ర బృందం ఘనంగా సత్కరించింది. కోన వెంకట్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘ప్రసాద్ వి.పొట్లూరి ఈ కథ నాకు వినిపించారు. వారే ఈ సినిమా నిర్మించాలని కూడా అనుకున్నారు.
కానీ ఆయనకు వేరే కమిట్‌మెంట్స్ ఉండటంతో ఆ బాధ్యత నాపై పడింది. ఓ మంచి సినిమా తీయాలని ఎదురు చూస్తున్న ఎం.వి.వి. సత్యనారాయణగారికి ఈ కథ వినిపించాను. ఆయన వెంటనే ‘ఓకే’ అనడంతో సినిమా మొదలుపెట్టాం. జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నవ్విస్తూ భయపెట్టే సినిమా ఇదని, యూనిట్ అంతా చక్కని సహకారం అందిస్తున్నారని నిర్మాత అన్నారు. ‘‘నేను టైటిల్ రోల్ పోషిస్తున్న మూడో చిత్రమిది. నటిగా నాకు మంచి గుర్తింపు తెస్తుందీ సినిమా’’ అని అంజలి ఆశాభావం వ్యక్తపరిచారు. శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని బ్రహ్మానందం చెప్పారు. సినిమా ఘనవిజయం సాధించాలని అతిథిగా విచ్చేసిన వి.వి. వినాయక్ ఆకాంక్షించారు. ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు.