
తమిళసినిమా: నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ఈ ఆరణాల అచ్చతెలుగు అమ్మాయి తెలుగు, తమిళం చిత్రాలు అంటూ చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 2007లో కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన నటి అంజలి. ఆ తరువాత అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాలతో నటిగా తానేమిటో తెలియజెప్పింది. ఇక ఆ మధ్య తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాల విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇటీవల మళ్లీ కోలీవుడ్‌లో చిత్రాలు చేస్తూ బిజీ అయ్యింది. బెలూన్, తరమణి చిత్రాల తరువాత అంజిలి నటించిన చిత్రం ఇక్కడ తెరపైకి రాలేదు.
యువ నటుడు జయ్‌తో ప్రేమ వ్యవహారం అంటూ తరచూ వార్తల్లోకెక్కిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అలాంటి ప్రచారానికి దూరమైందని చెప్పవచ్చు. తాజాగా మరోసారి కోలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. ఇక్కడ తగ్గిన తన మార్కెట్‌ను మళ్లీ పొందడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా నటించిన పేరంబు చిత్రం ఫిబ్రవరి ఒకటవ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రం అన్నది గమనార్హం. దీంతో ఈ చిత్రంపై అంజలి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం తరువాత శశికుమార్‌తో నటించిన నాడోడిగళ్–2 చిత్రం విడుదల కానుంది. అదే విధంగా మరికొన్ని కొత్త చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని అంజలి పేర్కొంది. ఈమె పొంగళ్ పండగ సందర్భంగా కొన్ని ఫొటోలను, తన అభిప్రాయాలతో కూడిన విషయాలను, తను శారీరక కసరత్తులు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. వాటిని ప్రసారం చేస్తూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment