మరో మంచి ప్రేమకథ!
‘కాట్రు వెళియిడై కన్నమ్మా... నిండ్రన్ కాదలై ఎన్ని కళిక్కిరేన్’.. ఏంటీ అర్థం కావడంలేదు కదూ. ‘గాలి వదిలే ప్రతిసారీ నీ ప్రేమను తల్చుకుంటూ బతికేస్తున్నాను..’ అనేది ఈ పాట అర్థం. అంటే.. శ్వాస తీసుకుంటున్నప్పుడూ.. వదులుతున్నప్పుడూ అనేది రచయిత భావం. 1961లో వచ్చిన ‘కప్పలోట్టియ తమిళన్’ (పడవ నడిపిన తమిళీయుడు అని అర్థం) అనే తమిళ సినిమాలో హీరో జెమినీ గణేశన్, హీరోయిన్ సావిత్రి ఈ పాటకు తెరపై కనబర్చిన అభినయాన్ని తమిళ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు.
ప్రముఖ కవి భారతియార్ రాసిన ఈ పాటలోని ముందు రెండు పదాలను తీసుకుని మణిరత్నం తన తాజా చిత్రానికి ‘కాట్రు వెళియిడై’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. భారతియార్ రాసిన ప్రేమ పాటను టైటిల్‌గా పెట్టారంటే.. ఇది ప్యూర్ లవ్ స్టోరీ అని ఊహించవచ్చు. కార్తీ, అదితీ రావ్ హైదరి జంటగా మణిరత్నం తీస్తున్న ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ శుక్రవారం ఊటీలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరుస్తున్నారు. మద్రాస్ టాకీస్ నిర్మిస్తోంది. గురువారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. మళ్లీ మణిరత్నం మరో మంచి ప్రేమకథా చిత్రం ఇవ్వనున్నారని ఫస్ట్ లుక్ వ్యక్తం చేస్తోంది.