‘దిల్’ రాజు, విజయేంద్ర ప్రసాద్, విక్రమ్, కుమరన్, సుభాస్కరన్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, శోభిత, ఐశ్వర్యలక్ష్మి ; ఐశ్వర్యారాయ్
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం.
విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు.
‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ.
‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment