
మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ లు ఘనవిజయాలు సాధింస్తుండగా ఇప్పుడు రాజకీయ నాయకుల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. గతంలో మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటించనున్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కీలకమైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బుధవారం (07-06-2017)నాడు రిలీజ్ చేయనున్నారు. ఆగస్ట్ 30వ తేదీన టీజర్‌ను విడుదల చేసేందుకు నిర్మాత సునీల్ బోహ్రా సన్నాహాలు చేస్తున్నారు.
కనీసం తాను ప్రధాని అవుతానని కలలో కూడా ఊహించని ఓ వ్యక్తి కథ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశానికి తాను ప్రధానిగా ఎన్నిక కాబోతున్నాడని ఒక రోజు ముందు వరకు తనకూ తెలియదు' అనే వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ తెలిపింది. 2014 ఎన్నికలకు ముందు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం రిలీజ్ కాగా.. 2019 ఎన్నికలకు ముందుకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.