అనుష్క
‘హలో అండీ... ఎలా ఉన్నారు?’ అని స్వీట్‌గా పలకరిస్తారు స్వీటీ. అంతేనా? తెలుగులో చక్కగా మాట్లాడతారు. మరి.. నిత్యామీనన్, రకుల్, అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవి, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్.. రష్మిక మండన్నలా అనుష్క తన పాత్రకు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోరు? వీళ్లందరికన్నా స్వీటీ సీనియర్. పైగా తెలుగు చక్కగా మాట్లాడతారు. ఇదే విషయం అనుష్క ముందుంచితే – ‘‘నేను తెలుగు మాట్లాడగలను. అయితే.. డబ్బింగ్ చెప్పేంత సాహసం చేయలేను. నా మాట చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది.
నేను మాట్లాడుతుంటే పక్కవాళ్లకు కూడా వినిపించదని మా కుటుంబ సభ్యులే అంటుంటారు. అటువంటప్పుడు నేను డబ్బింగ్ చెబితే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అంతెందుకు? ‘అరుంధతి’ సినిమాలో ‘నువ్వు నన్నేం చేయలేవురా’ డైలాగ్ ఇంటి వద్ద చాలాసార్లు ప్రాక్టీస్ చేసినా అంత గట్టిగా చెప్పలేకపోయాను. ఇటీవల వచ్చిన ‘భాగమతి’ సినిమాలోని ‘ఇది భాగమతి అడ్డా’ డైలాగ్ కూడా అంతే. ఆ పాత్రలకు తగ్గ గంభీరమైన గొంతు నాకు లేదు. అందుకే డబ్బింగ్ చెప్పడం లేదు’’ అన్నారు. పాయింటే కదా.
Comments
Please login to add a commentAdd a comment