
‘‘భాగమతి’ కథను 2012లో యూవీ క్రియేషన్స్ వారికి చెప్పాను. తర్వాత ప్రభాస్‌కి వినిపించాను. ఆ తర్వాత అనుష్కకి చెప్పా. అందరికీ కథ నచ్చడంతో చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అని దర్శకుడు జి.అశోక్ అన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.
► ఇదొక యూనివర్శల్ సబ్జెక్ట్. ఏ నేపథ్యానికైనా సరిపోతుంది. కోలీవుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఇలా ఏ ఇండస్ట్రీలో చేసినా హిట్టవుతుంది. ఇందులో కథ ప్రతి చోటా జరిగేదే.. అందరికీ పరిచయమైనదే.
► ‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్‌కు వెళ్లకముందే అనుష్క ‘భాగమతి’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే.. ‘బాహుబలి’ కమిట్మెంట్ వల్ల చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు ‘భాగమతి’ మొదలుపెడదామని ప్రయత్నించినా కుదరలేదు.
► ‘భాగమతి’ పాట్రన్ క్యారీ చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండాలి. అవి రెండూ అనుష్కలో కనిపించాయి. అందుకే.. ఆమె తప్ప ఈ కథకి ఎవరూ న్యాయం చేయలేరనే ఇన్నేళ్లు ఆగాను. ఆమె లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు అనుష్క. ఎడమ చేతి భుజానికైన గాయం బాధపెడుతున్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు.
► ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ సినిమాకు అదే బలం. ఈ చిత్రంలోని బంగ్లా సెట్ కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ దాని చుట్టూ తిరుగుతుంది. తొలుత నార్మల్‌గా వేద్దామనుకున్నాం. అది సరిపోదని భారీగా వేశాం. 75 శాతం సినిమా కోట సెట్‌లోనే జరుగుతుంది.
► ప్రస్తుతానికి నా దృష్టంతా ‘భాగమతి’ పైనే ఉంది. అందుకే ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ అనుకోలేదు. ‘భాగమతి’ విడుదల తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అన్నీ పూర్తయ్యాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా.
Comments
Please login to add a commentAdd a comment