రవీందర్, ప్రమోద్, విక్కీ, అశోక్, అనుష్క, మనోజ్, అల్లు అరవింద్, నాని...
‘‘భాగమతి’ ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే కాస్త భయమేసింది. ఏడాదికిపైగా ఈ సినిమా తీస్తున్నారు. అనుష్కకి ఉన్న ఏకైక లక్షణం.. ఓపిక చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో అది ఎవరికీ లేదు. ఆ విషయాన్ని ‘అరుంధతి’ చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ సినిమాలా ‘భాగమతి’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అనుష్క టైటిల్ రోల్‌లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ– ‘‘గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ రెండూ సమాంతరంగా నడుస్తుంటాయి. తను గెలుస్తూ.. తన చుట్టూ ఉన్నవారిని గెలిపిద్దాం అని ఎవరైనా ఆలోచిస్తే.. అతనిలో దైవత్వం మొదలైనట్లు. అలాంటి దేవుడైన ప్రభాస్ ముందు ఈ కథ విని, ఇక్కడిదాకా నడిపించారు. వంశీ, ప్రమోద్, విక్కీగారు త్రిమూర్తులు. వీరితో ఐదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. సినిమాను బిడ్డలా చూసుకున్నారు.
‘భాగమతి’ కోసం అనుష్క విపరీతమైన డస్ట్‌లో 45 రోజులు పని చేశారు’’ అన్నారు. ‘‘2012లో ‘భాగమతి’ కథ వినగానే నచ్చిందన్నా. కానీ, డేట్స్ లేకపోవడంతో చేయలేనని చెప్పా. ఈ సినిమా నేను కాకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే బాధపడేదాన్ని. ఎందుకంటే నా హృదయానికి బాగా దగ్గరైన కథ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘నాతో ‘పిల్లజమీందార్’ చేసిన తర్వాత అందరూ ఆశోక్‌ను ‘పిల్లజమీందార్ అశోక్’ అని పిలుస్తున్నారు. జనవరి 26 తర్వాత అందరూ ‘భాగమతి అశోక్’ అని పిలుస్తారు.
ఈ ఏడాది టాలీవుడ్‌కి సరైన హిట్ పడలేదు. ‘భాగమతి’తో ఆ హిట్ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘సాధారణంగా నటీనటులు, దర్శకులకు అభిమానులుంటారు. కానీ, నిర్మాతలకు ఉండరు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు అభిమానులుంటారు’’ అన్నారు దర్శకుడు మారుతి. దర్శకులు మేర్లపాక గాంధీ, రాధాకృష్ణ, నటులు ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment