వంశీ, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, అల్లు అరవింద్, సుమంత్ అశ్విన్, నిహారిక, నాగబాబు, రామ్‌చరణ్, శక్తికాంత్ కార్తీక్, లక్ష్మణ్ కార్య, మురళీశర్మ
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకోవడానికి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు ఎప్పుడూ ముందుంటారు. కానీ తెరవెనుక నుంచే మొత్తం నడుపుతారు. రిస్క్, రివార్డులు తీసుకునే వాళ్లలో ‘బాహుబలి’ నిర్మాతలు (శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) తర్వాత వీరినే అనుకుంటా. గుండె ధైర్యంతో పాటు చాలా పెద్ద మనసున్న మంచివాళ్లు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిహారిక మా ముందు పుట్టి పెరిగి మామయ్యా.. అంటుండేది. ఇవాళ హీరోయిన్‌గా చూస్తుంటే నాకు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. సుమంత్ అశ్విన్ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. టీనేజ్‌కి కొంచెం పైబడినట్టు ఉండి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయగల తక్కువ మంది హీరోల్లో సుమంత్ ఒక్కరు. ఎమ్మెస్ రాజుగారితో పోటీ పడి పైకొచ్చాం. అంత మంచి నిర్మాత ఆయన. ఇటీవల ఓ సినిమాలో మురళీశర్మగారి నటన చూశాక ఎస్వీ రంగారావుగారి అవార్డు ఉంటే ఇవ్వాలనిపించింది. అంత బాగా చేశారు. ‘సమ్మోహనం’ సినిమా చూసి నరేశ్‌ని అభినందిస్తూ మెసేజ్ చేశా. ‘హ్యాపి వెడ్డింగ్’ ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనుకునే సినిమాల్లో ఇదొకటి’’ అన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘నిహారిక కోసమో, ఈ సినిమా గురించి మాట్లాడటానికో ఇక్కడికి రాలేదు. ఎమ్మెస్ రాజుగారి కోసం వచ్చా. ఆయన, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. వంశీ అన్న, విక్రమ్, ప్రమోద్‌గారు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. వారిపై నమ్మకంతో, నిహారిక మాటలు విన్నాక, ట్రైలర్ చూశాక కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ పండితే సినిమా కూడా పండుతుందని చాలా వరకు నేను నమ్ముతా. మురళీశర్మగారితో ‘ఎవడు’ సినిమా చేశా. త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నా. సుమంత్ వెరీ హార్డ్‌వర్కర్. తన కెరీర్‌కి ఇది మైల్‌స్టోన్ అవుతుంది.
ఎమ్మెస్ రాజుగారితో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. నెలక్రితం నాన్నగారు (చిరంజీవి), నేను కూర్చుని ఉన్నప్పుడు రాజుగారి టాపిక్ వచ్చింది. నాన్నగారు 1980లలో జరిగిన ఓ సంఘటన చెప్పారు. నాన్నగారు చాలా మంది నిర్మాతలతో పని చేస్తూ ఉండేవారు. ఓ నెల నాన్నకీ, అమ్మకీ డబ్బులు సరిపోలేదు. నాన్నగారు హీరోగా పని చేస్తున్న ఓ ముగ్గురు నిర్మాతలను ఐదు వేలు అప్పు అడిగితే వాళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరిగా ఎమ్మెస్ రాజుగారి నాన్నగార్ని (అయ్యప్పరాజు) అడిగినప్పుడు.. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఐదు వేల రూపాయలు నాన్నగారికి ఇచ్చి తీసుకో.. తర్వాత తీసుకుంటాను అన్నారట ఎమ్మెస్ రాజుగారు. తర్వాత నాన్న తిరిగిచ్చేశారు.
అది ఇవాళ్టికి కూడా గుర్తుపెట్టుకుని నాన్నగారు నాకు చెప్పారు. ఎమ్మెస్ రాజుగారు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ గురించి చెప్పగానే అది నా బాధ్యత.. వస్తాను అన్నాను. ఇక్కడికి నేను రావడం గొప్ప విషయం కాదు. ఆయన గొప్పతనం మీ అందరికీ చెప్పాలనే ఇక్కడికొచ్చా. నటుడికి, నిర్మాతకి, డైరెక్టర్‌కి కావాల్సింది ప్రతిభే కాదు మంచి ప్రవర్తన. గ్రేట్ టాలెంట్ ఉన్నవారు బ్యాడ్ యాటిట్యూడ్‌తో ఉంటే సక్సెస్ అవలేరు కానీ, బ్యాడ్ టాలెంట్ ఉన్నా ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే ఎప్పటికైనా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అలాంటి రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలని మా ఫ్యామిలీ తరఫునుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘హ్యాపి వెడ్డింగ్’ వెరీ గుడ్ టైటిల్. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ సినిమా ‘బొమ్మరిల్లు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్ బి. గోపాల్. ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో బిగ్గెస్ట్ ఫంక్షన్ పెళ్లి. ఆ ఈవెంట్ ఓ ఎమోషనల్ ప్యాకేజ్.. అదే మా ‘హ్యాపి వెడ్డింగ్’. ఈ సినిమా ఫీల్‌ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళతారని చెప్పగలను. సుమంత్, నిహారికగార్ల సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చాలా కష్టం’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘హ్యాపి వెడ్డింగ్’ కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యి ఓకే చేశా. ఈ కథకి అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. వంశీ, ప్రమోద్‌గారు లక్కున్న నిర్మాతలు. ఆ లక్ మాకూ వస్తుందనుకుంటున్నా’’ అన్నారు నిహారిక. ‘‘ఈ సినిమాలో కొన్ని సీన్లకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అవి స్వీట్ మెమొరీస్. వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రేక్షకులే దేవుళ్లు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’’ అన్నారు సుమంత్ అశ్విన్.
Comments
Please login to add a commentAdd a comment