అమ్మ లేకుంటే చనిపోయేవాణ్ణి | Allu Aravind speech at Kanchana 3 Pre Release Event | Sakshi
Sakshi News home page

అమ్మ లేకుంటే చనిపోయేవాణ్ణి

Published Fri, Apr 19 2019 12:35 AM | Last Updated on Fri, Apr 19 2019 8:02 AM

Allu Aravind speech at Kanchana 3 Pre Release Event - Sakshi

‘‘పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్‌ చాలా సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి, ‘హిట్లర్‌’ సినిమాతో డ్యాన్స్‌ మాస్టర్‌గా మారాడు. ఇప్పుడు లారెన్స్‌ ఓ బ్రాండ్‌లా తయారయ్యాడు. అతని సినిమా వస్తోందంటే అందరూ ఎదురు చూస్తున్నారు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, శ్రీమాన్‌ ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘కాంచన 3’. లారెన్స్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది.

తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ బ్రోచర్‌ను అల్లు అరవింద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంపాదించిన దాన్ని పదిమందికీ పంచాలనుకుంటాడు లారెన్స్‌. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు’’ అన్నారు. ‘‘అమెరికాలో సిల్వస్టర్‌ స్టాలోన్‌ తనని తాను హీరోగా తయారు చేసుకున్నాడు. అలాగే లారెన్స్‌ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘లగడపాటి’ శ్రీధర్‌.

‘‘లారెన్స్‌లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌. రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ‘ఠాగూర్‌’ మధుగారికి థాంక్స్‌. లగడపాటి శ్రీధర్‌గారితో ‘స్టైల్‌’ సినిమా చేశాను. ఇప్పుడు ‘స్టైల్‌ 2’ చేద్దామంటున్నారు.. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్‌ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్‌ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్‌ చేసే వాళ్లలో బన్నీ, చరణ్, తారక్‌ ఉన్నారు. అన్నయ్యే (చిరంజీవి) అన్నింటికీ బాస్‌. ఆయన ‘హిట్లర్‌’ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌గా చాన్స్‌ ఇవ్వకుంటే.. నేను నంబర్‌ వన్‌ డ్యాన్స్‌మాస్టర్‌ని అయ్యేవాడినే కాను.

నాగార్జునగారు డైరెక్షన్‌ చాన్స్‌ ఇచ్చేవారే కాదు.  నన్ను ఆశీర్వదించిన రజనీకాంత్‌గారికి, చిరంజీవిగారికి, నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునగారికి థాంక్స్‌. నేను డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఇక్కడ కూడా చారిటబుల్‌ ట్రస్ట్‌ స్టార్ట్‌ చేశాను. ట్రస్ట్‌ ద్వారా మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమె లేకుంటే నేను బ్రెయిన్‌ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాణ్ణి. మా అమ్మే నాకు దేవత. అందుకే అమ్మకు గుడి కట్టించాను. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సమస్య, ఆర్థికంగా వెనకబడి చదువుకోలేనివారు నన్ను సంప్రదించవచ్చు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement