దర్శకుడు జి. అశోక్
‘‘ఎవరైనా వాళ్ల సినిమాను ప్రేక్షకులకు థియేటర్స్‌లోనే చూపించాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల తప్పనిసరి అయింది’’ అన్నారు దర్శకుడు జి. అశోక్. అనుష్క ముఖ్య పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. అశోక్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ‘దుర్గామతి’ టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్ర చేశారు. అక్షయ్ కుమార్ ఓ నిర్మాత. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా అశోక్ చెప్పిన విశేషాలు.
► ఓ పెద్ద హీరోతో హిందీ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు ‘భాగమతి’ రీమేక్ కోసం హిందీ నిర్మాతలు నన్ను కలిశారు. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది దాటడంతో ఇప్పుడు రీమేక్ చేస్తే చూస్తారా? అనుకున్నాను. రీమేక్ చేయాలని, నేనే చేయాలని నిర్మాతలు అడిగారు. అప్పటికే అక్షయ్ కుమార్‌గారు ఈ సినిమా రీమేక్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. ఒరిజినల్‌లో మనం సరిగ్గా చెప్పలేదు అనుకున్న సీన్లను ఇంకా బాగా చెప్పొచ్చు
► దర్శకుడిగా నాకు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛని ఇచ్చారు. భూమి పెడ్నేకర్ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నాం. చాలా బాగా చేసింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. లాక్‌డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాం. షూటింగ్ కంటే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా కష్టం అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో టెక్నీషియన్లు బయటకు రావడానికి కాస్త భయపడ్డారు.
► ఈ సినిమా థియేటర్స్ కోసం చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇంట్లోనూ వీలైనంత ఆస్వాదించేలా ఈ సినిమాను రెడీ చేశాం. ‘సినిమా బుల్లెట్‌లా పరిగెడుతోంది. చాలా బావుంది’ అని చూసిన తర్వాత అక్షయ్ కుమార్‌గారు అన్నారు.
► హన్సికతో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అదీ అమెజాన్‌లో త్వరలోనే విడుదల కానుంది. అలానే ఓ రెండు హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఒక సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment