అనుష్క ముక్కుసూటి మనిషి
తాజాగా సుల్తాన్ సినిమాలో మల్లయోధురాలి పాత్ర పోషించిన అనుష్కా శర్మ.. ఆ సినిమాలో తన పాత్ర లాగే చాలా ముక్కుసూటిగా వ్యవహరించే మనిషట. అదే రణ్బీర్ కపూర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంటాడట. ఈ విషయాలు ఎవరు చెప్పారని అనుకుంటున్నారా.. ప్రముఖ మోడల్, నటి అయిన లీసా హేడెన్ ఇదంతా తెలిపింది. తాజాగా ఆమె ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమాలో అతిథిపాత్రలో కనిపిస్తోంది. అందులో రణ్బీర్ కపూర్, అనుష్కా శర్మ జంటగా నటిస్తున్నారు.
కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లీసా హేడెన్ తళుక్కుమంటుంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఐశ్వర్య అందం చూసి తాను ఆమె వద్దకు వెళ్లడానికే కొంత సిగ్గుపడ్డానని, అనుష్క అయితే తనకు ఏం కావాలో, తానేం చేస్తానో ముక్కుసూటిగా చెప్పేస్తుందని లీసా అంటోంది. రణ్బీర్ కపూర్ చాలా కూల్గా ఉంటాడని, అతడితో కలిసి నటిస్తుంటే ఒకటే నవ్వులు వస్తుంటాయని తెలిపింది. తన పాత్ర చూసి నిజంగా చాలా మంచి కిక్ వచ్చిందని, ప్రస్తుతానికి అది మాత్రమే చెప్పగలనని అంటోంది.