సెవన్ ఇయర్స్ రీచ్!
అనుష్కా శర్మ నిర్మొహమాటంగా మాట్లాడతారు. మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. అందుకే ఆమెను బాలీవుడ్‌లో ‘వామ్మో అనుష్కా’ అంటుంటారు. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ‘వామ్మో’ అనే ట్యాగా?. అయినా డోంట్ కేర్. నేను ఓపెన్‌గానే మాట్లాడతా’ అంటారీ బ్యూటీ. ‘రబ్ నే బనా దీ జోడి’ చిత్రం ద్వారా ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. ఇప్పటికి ఏడేళ్లయ్యింది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తాను గమనించినవాటిలో ఏడు విషయాలను అనుష్కా శర్మ ఈ విధంగా పంచుకున్నారు.
1> అమ్మాయిలు చూడచక్కగా ఉండాలి. స్వీట్‌గా ప్రవర్తించాలి. మొదటి చూపులోనే ‘ఈ అమ్మాయి మన సరసన నటిస్తే బాగుంటుంది’ అనేలా ఉండాలి. అబ్బాయిలకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎలా ఉన్నా చల్తా. స్వీట్‌గా ప్రవర్తించకపోయినా నో ప్రాబ్లమ్.
2> అబ్బాయిలు ఏ వయసులోనైనా హీరోలుగా చేయొచ్చు. అమ్మాయిలు మాత్రం వయసులో ఉన్నంతవరకే పనికొస్తారు. ఆ తేడా ఏంటో అర్థం కావడంలేదు. బహుశా అమ్మాయిలను ‘సెక్సువల్ ఆబ్జెక్ట్స్’గా చూడటంవల్లే వాళ్లను వయసులో ఉన్నంతవరకే కథానాయికలుగా ఆమోదిస్తారేమో.
3> అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా అబ్బాయిలకు అన్ని సౌకర్యాలున్న మంచి గది ఇస్తారు. అమ్మాయిలకు అంత సీన్ లేదు. ఎందుకో?
4> అమ్మాయిలు తాము అనుకున్నది ధైర్యంగా చెబితే ఎవరికీ నచ్చదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటి అమ్మాయిలను ఇష్టపడరు.
5> అర్హతకి తగ్గ పారితోషికం అడిగితే అదో పెద్ద తప్పులా భావిస్తారు. ఏం కథానాయి కలేమైనా ఫూల్సా? వాళ్ల మార్కెట్‌కి తగ్గ పారితోషికం తీసుకోకూడదా?
6> ఒకవేళ నేను కథానాయికగా నటించే సినిమాలో నా పాత్రకన్నా హీరో పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉందనుకోండి.. అప్పుడు ఆ పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. పురుషాధిక్యం ఆ స్థాయిలో ఉంటుంది.
7> నన్నూ, మా అన్నయ్యనూ మా అమ్మా, నాన్న సమానంగానే పెంచారు. తేడా చూపించలేదు. అందుకే, అమ్మాయిలు అణిగి మణిగి ఉండాలనే మాటలు విన్నప్పుడు నాకు వింతగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఫీమేల్ యాక్ట్రెస్ అంటే దాదాపు చిన్న చూపు ఉండటం చూసి ఆశ్చర్యపోయేదాన్ని.