అలా చేస్తే అనారోగ్యం ఆమడ దూరం!
మాంసాహారానికి అలవాటుపడినవాళ్లకి మసాలా వాసన తగిలితే చాలు... మనసు అటువైపు లాగేస్తుంది. నోరు ఓ రేంజ్‌లో ఊరిపోతుంది. కానీ, మాంసాహరం కన్నా శాకాహారమే మిన్న అంటారు కాబట్టి, కొంతమంది జిహ్వ చాపల్యాన్ని అణిచేసుకుని, శాకాహారులుగా మారిపోతున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్ శాకాహారిగా మారిపోయారు. చివరికి పాల ఉత్పత్తులతో చేసే ఆహారాన్ని కూడా త్యజించి వేగన్‌గా మారారాయన. తాజాగా అనుష్కా శర్మ కూడా ఆమీర్‌ను ఫాలో అయ్యారు. అయితే వేగన్‌గా మారలేదనుకోండి.
కానీ కొన్ని నెలలుగా మాంసాహారాన్ని ముట్టుకోకుండా కూరగాయలతో కానిచ్చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘మాంసాహారానికి గుడ్‌బై చెప్పి చాలా నెలలయింది. గతంలో కన్నా ఇప్పుడింకా ఆరోగ్యంగా ఉన్నాను. ఆకు కూరలు, క్యారెట్, బీన్స్.. ఒకటేమిటి అన్నీ మంచిదే. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్.. ఇవన్నీ తింటే అనారోగ్యం మన దరికి చేరదు’’ అని అనుష్కా శర్మ చెప్పారు.