ఆ రోజును జీవితంలో మరచిపోలేను
అది రాజస్తాన్ ఎడారి ప్రాంతం. సమయం సాయంత్రం కావొస్తోంది. ‘ఎన్‌హెచ్ 10’ సినిమా బృందం... షూటింగ్‌లో నిమగ్నమై ఉంది. అనుష్కశర్మకు సన్నివేశాన్ని వివరిస్తున్నాడు దర్శకుడు నవదీప్‌సింగ్. ఉన్నట్టుండి వాతావరణంలో చిన్న మార్పు. నిదానంగా గాలులు మొదలయ్యాయి. ఆ గాలులు యూనిట్ సభ్యులకు ఆహ్లాదాన్ని పంచాయి. వారిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. మంచి జోష్‌గా పని చేసుకుంటూ పోతున్నారు. గాలి వేగం ఇంకాస్త పెరిగింది. దాన్ని కూడా యూనిట్ లైట్‌గానే తీసుకుంది. అయితే... రానురానూ గాలి వేగం పెరగడంతో యూనిట్ అప్రమత్తమయ్యింది. పేకప్ చెప్పేసి, తట్టాబుట్టా సర్దేయబోయారు అందరూ. కానీ... అంత అవకాశం వారికి ఆ గాలి ఇవ్వలేదు.
ఆ చిన్న గాలే... భయంకరమైన ఇసుక తుఫాన్‌గా మారింది. యూనిట్ సభ్యులందరూ ఆ గాలికి అల్లకల్లోలం అయిపోయారు. ఎగసి పడుతున్న ఇసుక తాకిడికి వారి శరీరాలు కందిపోయాయి. ఎవరెవరు ఎక్కడ పడ్డారో వారికే తెలీదు. అయితే... ఒక్కసారిగా తుఫాన్ శాంతించింది. మళ్లీ అందరూ ఒకే చోటకి చేరుకున్నారు. ‘‘నా జీవితంలో ఈ నెల 17 మరచిపోలేని రోజు. ఇసుక తుఫాన్ ఎలా ఉంటుందో చూశాను. ఆ తుఫాన్ తాకిడికి అందరం చెల్లాచెదురైపోయాం. దాదాపు ఓ అరగంట పాటు దుమ్ముధూళితో ఉక్కిరిబిక్కిరైపోయాం. అయితే... ఎవరికీ చిన్న గాయం కూడా తగల్లేదు’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు అనుష్కశర్మ.