– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
‘‘వెయ్యిరోజులాడిన తొలి దక్షిణ భారతీయభాషా చిత్రం ‘లెజెండ్’. మామూలు చిత్రమే వెయ్యి రోజులు ఆడితే ఓ చరిత్ర ఉన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వెయ్యి రోజులు... ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఆడుతుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. చిరంతన్ భట్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను సోమవారం తిరుపతిలో విడుదల చేశారు. చంద్రబాబు ఆడియో సీడీలను ఆవిష్కరించి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ – ‘‘తెలుగు వారి చరిత్ర మళ్లీ అమరావతితో ముందుకొచ్చింది. నేను లండన్‌లో మ్యూజియానికి వెళ్లినప్పుడు అక్కడ రెండే గ్యాలరీలున్నాయి. వాటిలో ఒకటి గ్రీసుది కాగా రెండోది అమరావతి గ్యాలరీ. మహిళలకు గౌరవం ఇవ్వాలని చరిత్రలో తొలిసారి తల్లిపేరును తన పేరు ముందు పెట్టుకున్న వ్యక్తి శాతకర్ణి. ఆయన చరిత్రని సిన్మాగా అందిస్తున్న క్రిష్‌కు అభినందనలు. అమరావతి నుంచి అఖండ భారతదేశాన్ని పరిపాలించిన శాతకర్ణి తెలుగు జాతికి గర్వకారణం. యేసు ప్రభువు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైంది. క్రీస్తు శకం వచ్చిన డెబ్భై సంవత్సరాలకు శాలివాహన శకం ఆరంభమైంది. ఈ సినిమా కంటే మించిన రాజధాని కట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. దేశంలో నంబర్‌వన్‌గా అమరావతిని తీర్చిదిద్దుతాం’’ అన్నారు.
సమయం లేదు... సంక్రాంతికే వస్తున్నాం!
బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వంద సినిమాలు చేయడానికి 43 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లూ నన్ను ముందుకు నడిపించింది ప్రేక్షకులూ, నా అభిమానులే. ఈనాడు ‘నటసింహం’గా, ఓ ఎమ్మెల్యేగా మీ (ప్రేక్షకులు)తో మన్ననలు అందుకోవడానికి నా తల్లితండ్రులు, మీ ఆశీస్సులే కారణం. శాతకర్ణి కథను వందో సినిమాగా చేయడం దైవసంకల్పం. ఎటువంటి భావోద్వేగాన్నయినా సమర్థంగా తెరకెక్కించగల క్రిష్, మంచి నటీనటులు, చిత్రబృందం కుదరడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. సినిమాలోని డైలాగ్ గుర్తుకొచ్చేలా, ‘‘ఇంక సమయం లేదు మిత్రమా... సంక్రాంతికి వస్తున్నాం’’ అని చిత్ర రిలీజ్ సమయాన్ని ప్రస్తావించారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ – ‘‘సరదా కోసమో, వినోదం కోసమో సినిమాలు ఎక్కువ తీస్తుంటారు. విజ్ఞానం కోసం, సందేశం కోసం సినిమాలు తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఒక సందేశంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా ఈ సినిమా తీయడం నా మనసుకు ఎంతో నచ్చింది.
అందువల్ల ఈ వేడుకకి వచ్చా. కేంద్ర సమాచార మంత్రిగా నాపై ఓ బాధ్యత కూడా ఉంది’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘అంజనాపుత్ర క్రిష్ అని నా పేరుకి ముందు మా అమ్మగారి పేరు వేశా. ‘అమ్మా! ఈ సినిమాతో నీ పేరు నిలబెడతా’. పెళ్లైన తర్వాత పట్టుమని పది రోజులు కూడా నా అర్ధాంగితో ఉండలేదు. ‘పద్మావతీపుత్రిక రమ్యా! నువ్వు నేనూ చాలా గర్వపడే సినిమా తీశా’ అని చెప్తున్నా. తెలుగుజాతి గర్వపడే సినిమా తీశా. శాతకర్ణి కథ చదువుతుంటే నా రక్తం మరిగింది. ఇలాంటి శాతకర్ణి ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? చూపు తీక్షణంగా.. మాటలు రాజసంగా... నడుస్తుంటే కాగడా రగులుతున్నట్టుగా ఉండాలి. ఈ కథే కథానాయకుణ్ణి ఎన్నుకుంది. ‘అదిగో.. బాలకృష్ణ ఉన్నాడు. బసవరామతారకపుత్ర బాలకృష్ణ ఒక్కడు మాత్రమే నా ఖ్యాతిని దశదిశలా విస్తరించగలడు’ అని ఆ శాతకర్ణి నాకు శాసించినట్టు చెప్పాడు. కేవలం పది నిమిషాల్లో కథ విని, ఈ సినిమా చేస్తున్నామని 14 గంటల్లో బాలకృష్ణ ఓకే చెప్పారు. నేనే సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్నాను. రోజూ సెట్‌లోకి మొదట వచ్చేది, చివర వెళ్లేది బాలకృష్ణగారే. నాతో పాటు ఆయన కూడా ఈ సినిమాకి కెప్టెనే’’ అన్నారు. ‘‘చాలా ఏళ్ల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన ‘పాండవ వనవాసం’లో చిన్న నృత్యం చేశా.
ఆ సినిమాతో నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో హీరో అమ్మ పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రముఖ హిందీ నటి హేమమాలిని. ‘‘బాలకృష్ణ 100వ చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘కంచె’ తర్వాత దర్శక, నిర్మాతలతో కలసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చిరంతన్ భట్. ‘‘అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగు మనిషికీ తెలియాలని బాలకృష్ణ ఈ సినిమా చేశారు. వంద సెంటర్లలో వంద రోజులు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు బోయపాటి శ్రీను. ఈ వేదికపై ‘ఎన్‌బికె 100... నెవర్ బిఫోర్’ అనే పుస్తకాన్ని హేమమాలిని, ‘ఎన్‌బికె 100’ డైరీలు, క్యాలెండర్‌లను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. నిర్మాతలు సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు నిర్మాతలు డి.సురేశ్‌బాబు, అంబికా కృష్ణ, అనిల్ సుంకర, దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, రచయిత సాయిమాధవ్ బుర్రా, హీరో నారా రోహిత్, టీ టీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ వెయ్యి రోజులాడుతుంది!
Published Mon, Dec 26 2016 11:57 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement