
వేసవి రావడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ హీట్ ఇప్పుడే మొదలైంది. వేడి మొదలైంది వెదర్‌లో కాదు. బాక్సాఫీస్ బరిలో. ఆల్రెడీ ఏప్రిల్‌లో పోటీ పడేందుకు నాగార్జున, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, కంగనా రనౌత్‌ల సినిమాలు రెడీ అవుతున్నాయి. ‘మేం ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాం.. మహేశ్‌బాబు సినిమా వెనక్కి తగ్గితే’ బాగుంటుంది అని అల్లు అర్జున్ కాంపౌండ్ అనుకుంటోంది. ఇంకా ఈ విషయమే సెటిల్ కాలేదు. ఈలోపు రజనీకాంత్ ‘రోబో 2.0’ లైన్లోకొచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ బరిలో దించనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఎనౌన్స్ చేసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో వేరే సినిమాలు ‘ఢీ’ కొంటాయా? వెనక్కి తగ్గుతాయా? అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్.
డైలమాలో పడేసిన ‘2.0’
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ చిత్రాన్ని స్టార్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. వచ్చే జనవరి 25న రిలీజ్ అన్నారు. అయితే ఆదివారం ఏప్రిల్‌లో రిలీజ్ అని రాజు మహాలింగం పేర్కొన్నారు. వాస్తవానికి జనవరిలో ఈ సినిమా వచ్చే చాన్స్ లేదని ‘2.0’లో విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్ తాను హీరోగా నటించిన హిందీ చిత్రం ‘ప్యాడ్ మ్యాన్’ రిలీజ్ జనవరి 26న అని ఎనౌన్స్ చేసినప్పుడే అర్థమైంది. దీంతో ‘2.0’ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందన్న ఊహగానాలు ఊపందుకున్నాయి.
తమిళ సంవత్సరం స్టార్ట్ అయ్యే ఏప్రిల్ 13న 2.0 ను రిలీజ్ చేస్తారని కొందరు అనుకున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘2.0’ ఏప్రిల్ 27న రిలీజ్ అని చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేశారు రాజమహాలింగం. సో.. ఈ సినిమా ఏప్రిల్ 27న ఖాయం అంటున్నాయి కోలీవుడ్ సినీ వర్గాలు. తరణ్ ఆదర్శ్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ‘‘బాహుబలి’ టీమ్ తరఫున ‘2.0’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని భల్లాలదేవుడు.. అదేనండీ రానా ట్వీట్ చేయడం విశేషం. ‘బాహుబలి’ ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. ఏది ఏమైనా ‘2.0’ని ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో మిగతా చిత్రాలు డైలమాలో పడ్డాయి.
భరత్ చెప్పినట్లు చేస్తాడా?
అక్టోబర్ 26న తెలుగు ఇండస్ట్రీలో మహేశ్ వర్సెస్ బన్నీ అని ఒకటే చర్చ. ఎందుకంటే మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) ను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నిర్మాతల్లో ఒకరైన ‘బన్నీ’ వాసు ఒక సినిమా ప్రెస్‌మీట్‌లో అసహనం వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రిలీజ్ డేట్ ముందే మేం ప్రకటించాం.
ఒకే తేదీన రెండు సినిమాలు విడుదల కావడం సరి కాదు. మాతో దానయ్యగారు ఒక్క మాట అయినా చెప్పి ఉండాల్సింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు.అయితే ఫైవ్ డేస్ బ్యాక్ మహేశ్ సినిమాను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయనున్నట్లు డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సినిమా షెడ్యూల్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. అప్పుడు అందరూ మహేశ్ వర్సెస్ బన్నీ ఫిక్స్ అనుకున్నారు. అయితే ఆ రోజే రిలీజ్ డేట్ లేని మరో పోస్టర్ ఆన్‌లైన్‌లో కనిపించింది. సో.. బాక్సాఫీసు వద్ద బన్నీ వర్సెస్ మహేశ్ లేనట్లేనా? ఇద్దరు సినిమాల నిర్మాతలు ఓ అండర్‌స్టాండింగ్ వచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్.
రేసుగుర్రంలా దూసుకెళ్తాడా?
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు.‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది జూన్‌లో స్టార్ట్ చేశారు. సెట్స్‌పైకి వెళ్లిన వెంటనే ఏప్రిల్ 27న తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ‘2.0’ సడన్‌గా సీన్లోకొస్తుందని నిర్మాతలు ఊహంచలేదు. మరి.. ఇప్పుడు ‘నా పేరు సూర్య ఆ ఇల్లు ఇండియా’ కూడా రిలీజ్ డేట్ మార్చుకోవాలా? మహేశ్‌బాబు సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే చర్చ జరుగుతోంది.
వీర వనిత వెనక్కి తగ్గాలా?
వీర వనిత రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న సినిమా ‘మణికర్ణిక’. ఆల్మోస్ట్ 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. అసలు ఏప్రిల్ బరిలో సినిమాను నిలిపింది ఫస్ట్ ఈ టీమ్‌నే. మే నెలలో వారణాసిలో జరిగిన ప్రోగ్రామ్‌లో ‘మణికర్ణిక’ అధికారిక పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆ పోస్టర్‌పై ఈ సినిమా రిలీజ్ తేదీ ఏప్రిల్ 27 అని ఉంది. మరి.. మణికర్ణిక వెనక్కి తగ్గుతారా? అన్న ప్రశ్నకు చిత్రబృందం దగ్గరే సమాధానం ఉంది. జీ స్టూడియోస్, కమల్‌జైన్, నిశాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వర్మ మనసు మార్చుకుంటారా?
నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో తాజా సినిమాపై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. ‘‘నవంబర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఫిబ్రవరి కల్లా ఫినిష్ చేసి, ఏప్రిల్‌లో విడుదల చేస్తాం. ఆ తర్వాతే ఏన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ చేస్తా’’ అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు వర్మ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్‌లోనే. ఏప్రిల్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఊహాగానాలు నెలకొన్నాయి. వర్మ మైండ్‌సెట్ మారుతుందా? తెలుసుకోవాలంటే వెయిట్ చేయక తప్పదు. కంపెనీ పతాకంపై సుధీర్‌చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సేమ్ సీన్!
2017 ఆగస్టు 11
2018 ఏప్రిల్ 27?
తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘లై’, బెల్లంకొండ శ్రీనివాస్ నటించన ‘జయజానకి నాయక’ చిత్రాలు ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ అయ్యాయి. రిలీజ్ డేట్స్‌లో తేడా లేకపోవడం వల్ల ఈ సినిమాల కలెక్షన్స్ దెబ్బతిన్నాయన్న గుసగుసలు ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి.
మరి.. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఇప్పటివరకు ‘2.0’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘మణికర్ణిక’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను 27నే ఫిక్స్ చేశారు. ‘బన్నీ’ వాసు, దానయ్య మాట్లాడుకోవడం వల్ల మహేశ్‌బాబు సినిమా రిలీజ్ డేట్ మారిందని టాక్. ఒకవేళ ‘2.0’ రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అయితే మిగతా మూడు సినిమాల సంగతేంటి? తేదీ మార్చుకుంటాయా? ఈ మూడు ఒకే తేదీన విడుదలవుతాయా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
పోటీ పడకూడదని...
‘‘వచ్చే ఏప్రిల్, మే నెలల్లో మా సినిమాలు విడుదల చేయాలనుకున్న నిర్మాతలందరం మా మధ్య ఎలాంటి పోటీ ఉండకూడదని కలసి, కూర్చుని చర్చించుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ‘2.0’ విడుదల తేదీని హఠాత్తుగా ప్రకటించడంతో అన్ని తెలుగు సినిమాలూ డైలమాలో పడ్డాయి. తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ఇతర భాషల చిత్రాలను గౌరవించింది, ఆహ్వానించింది. అయితే ‘2.0’ లాంటి పెద్ద ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ మారడం వల్ల తెలుగు నిర్మాతల మధ్య కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ట్రేడ్ బాడీస్ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి’’ అని మహేశ్‌బాబు హీరోగా (‘భరత్ అనే నేను’) తాజా సినిమా నిర్మిస్తోన్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళతా
‘‘లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘2.0’ చిత్రాన్ని గౌరవిస్తున్నాం. కానీ, సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో మీరు (‘2.0) నిర్మాతలు) చేస్తున్న మార్పులు ప్రాంతీయ చిత్రాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ ఈ విషయంలో (‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ – సహ నిర్మాత), డీవీవీ దానయ్య (మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ నిర్మాత) ఒక అండర్ స్టాండింగ్‌కి రావడానికి చర్చించుకుంటున్నాం. ఈ విషయాన్ని (‘2.0’ రిలీజ్) నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తాం. మా రిలీజ్ డేట్స్ కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఉండాలనుకుంటున్నాం. ఈ నిర్ణయం రాబోయే ప్రాంతీయ చిత్రాలకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
– డి.జి. భవాని ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment