అందుకు ఇది సమయం కాదు: రహమాన్‌ | AR Rahman Says This is No Time For Religious Congregation Lockdown | Sakshi
Sakshi News home page

మీ హృదయంలోనే దేవుడున్నాడు: రహమాన్‌

Published Thu, Apr 2 2020 2:34 PM | Last Updated on Thu, Apr 2 2020 3:03 PM

AR Rahman Says This is No Time For Religious Congregation Lockdown - Sakshi

ముంబై: మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నానని సంగీత దిగ్గజం ఏఆర్‌ రహమాన్‌ అన్నారు. అంటువ్యాధిని కట్టడి చేసేందుకు తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నా లెక్కచేయ కృషి చేస్తున్న తీరును అభినందించాలన్నారు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడాల్సిన ప్రస్తుత తరుణంలో భేషజాలకు వెళ్లకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ఇటువంటి సమయంలో మానవత్వాన్ని పరిమళింపజేయాలని సూచించారు. 

‘‘దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమిగూడటానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం సూచనలను పాటించండి. స్వీయ నిర్బంధంలోకి వెళ్తే మరికొన్నేళ్లు మీరు బతుకవచ్చు. వైరస్‌ను వ్యాప్తి చేయకండి. సాటి మనుషులకు హాని కలిగించకండి. మీకు వైరస్‌ సోకదని అనుకుంటే పెద్ద పొరపాటే. వదంతులు వ్యాప్తి చేసి భయాలను పెంచకండి. దయచేసి జాగరూకతతో మెలగండి. లక్షలాది మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి’’అని రహమాన్‌  ఓ నోట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.(తబ్లిగ్‌ జమాత్‌ : ఆడియో విడుదల)

 కాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు ఘటన దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత నెల 13 నుంచి 15 వరకు తబ్లిగి జమాత్‌ అక్కడ నిర్వహించిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న పలువురికి కరోనా వైరస్‌ సోకింది. అయితే వారంతా ప్రస్తుతం సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. దీంతో కార్యక్రమ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రహమాన్‌ పై విధంగా ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement