
కోలీవుడ్‌కు అర్జున్‌రెడ్డి నాయకి
తమిళసినిమా: తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి నాయకికి కోలీవుడ్‌లో ఎంట్రీ ఖారారైంది. ఈ మధ్య కాలంలో అనూహ్య విజయాన్ని సాధించిన తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి. చాలా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయిన నటి షాలిని పాండే. జైపూర్‌కు చెందిన ఈ బ్యూటీకిదే తొలి చిత్రం. ఇంజినీరింగ్ చదివిన ఈ జాణ కాలేజీ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్టుగా అనుభవం గడించిందట. దీంతో అర్జున్‌రెడ్డి చిత్రంలో కథానాయకుడి ప్రేయసిగా చాలా చక్కని నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలనను అందుకుంది. ఇప్పుడీమె పేరు ఒక్క తెలుగు చిత్రపరివ్రమలోనే కాదు.
ఇతర భాషలకూ పాకేసింది. తాజాగా కోలీవుడ్‌లో చాన్స్ కొట్టేసింది కూడా. తమిళంలో యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ్ రీమేక్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా నటించిన పాత్రలో షాలిని పాండే నటించనుంది. ఇందులో ఇంతకు ముందు నటి లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తన కాల్‌షీట్స్ సమస్య కారణంగా చిత్రం నుంచి వైదొలగడంతో ఆమెకు బదులు షాలిని పాండే నటించనుంది. దీనికి 100 శాతం కాదల్ అనే టైటిల్‌ను పెట్టారు.
నవ దర్శకుడు చంద్రమౌళి దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. షాలినిపాండే ఇప్పటికే నటి కీర్తీసురేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోందన్నది గమనార్హం.