
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లే వస్తున్నాయి. అలా తాజాగా నెటిఫ్లిక్స్‌లో రిలీజైన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘డబ్బా కార్టెల్’(Dabba Cartel Review). షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, నిమిషా సజియన్, అంజలి ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. షీలా(షబానా ఆజ్మీ) కోడలు రాజీ(షాలినీ పాండే)‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది. ఈ బిజినెస్‌లో మరో ఇద్దరు మహిళలు మాల(నిమిషా సజయన్), షాహిదా(అంజలి ఆనంద్) కూడా భాగస్వామ్యం అవుతారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన మాల..తప్పనిసరి పరిస్థితుల్లో లంచ్ బాక్స్‌లో ఆహారంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసేందుకు అంగీకరిస్తుంది. ఈ విషయం రాజీకి తెలియగానే..మొదట నో చెప్పినా.. తర్వాత ఆమె కూడా గంజాయి సరఫరాకు ఓకే చెబుతుంది.
కొన్నాళ్ల తర్వాత ఈ గంజాయి బిజినెస్ ఆపేద్దామని అనుకుంటారు. ఆ లోపే డ్రగ్స్ విక్రయించాలని వీరిపై ఒత్తిడి వస్తుంది. లంచ్ బాక్స్ మాత్రమే అందజేసే ఈ మహిళలు.. గంజాయి, డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజీ చేస్తున్న స్మగ్లింగ్ గురించి అత్తయ్య షీలాకు తెలిసినా.. ఆమె ఎందుకు వారికి సపోర్ట్ చేసింది? చివరకు ఈ మహిళలు ఆ వ్యాపారాన్ని మానేశారా లేదా? వివా ఫార్మా కంపెనీ తయారు చేసిన ఓ మెడిసిన్ ప్రమాదకరమని ప్రపంచానికి చెప్పాలన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) ప్రయత్నం ఫలించిందా? ఫార్మా కంపెనీ ఉద్యోగి శంకర్(జిషు సేన్‌గుప్త) సతీమణి వరుణ(జ్యోతిక)తో రాజీ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాజీ గ్యాంగ్‌తో కలిసి ఎందుకు పని చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘డబ్బా కార్టెల్’ చూడాల్సిందే.
కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తుంటారు.ఒకసారి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాల్సి వస్తుంది. అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేసిన ఐదుగురు మహిళల కథే ‘డబ్బా కార్టెల్’. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడతారనేది రాజీ, మాల పాత్రల ద్వార చక్కగా చూపించాడు దర్శకుడు హితేశ్ భాటియా. భార్యభర్తలు ఒకరి చేసే పని గురించి మరొకరికి పూర్తిగా తెలియాలి. భర్తకు తెలియకుండా భార్య..భార్యకు తెలియకుండా భర్త డబ్బు కోసం ప్రమాదకర పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ ద్వారా చూపించారు.
అలాగే ఫార్మా కంపెనీలో ఎలాంటి లొసుగులు ఉంటాయో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కోటి దాదాపు ముప్పావు గంట వరకు ఉంటుంది.తొలి ఎపిసోడ్ కేవలం పాత్రల పరిచయానికే సరిపోయింది. రెండు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. సంతోష్ అనే వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేసి.. డ్రగ్స్, గంజాయి అమ్మించడం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో రాజీ గ్యాంగ్ చేస్తున్న ఈ స్మగ్లింగ్ బిజినెస్ గురించి అత్తయ్య షీలాకి తెలిసిన తర్వాత కథనం మరింత ఉత్కంఠంగా సాగుతుంది.
దర్శకుడు ఈ కథను వినోదభరితంగా నడిపించడంతో పూర్తిగా సఫలం కాలేదు. ఐదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ట్విస్టులు కూడా ఊహకందేలా ఉంటాయి.డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుటుంది. సీజన్ 2కి స్కోప్ ఇస్తూ ఈ సిరీస్‌ని ముగించారు. నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సిరీస్ పర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు తక్కువే ఉన్నా..బూతు డైలాగులు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీలో కలిసి చూడడం కాస్త కష్టమే. ఓపిగ్గా చూద్దాంలే అనుకునే క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్‌ని ఈ సిరీస్ మెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment