స్విట్జర్లండ్ వస్తానని నాన్నకు లేఖ రాశా!
తాను స్విట్జర్లాండ్ చూడాలనుకున్నప్పుడు నాన్నకు ఎలా చెప్పాలో తెలియలేదని, అందుకే ఆ విషయాన్ని ఒక లేఖలా రాసి ఆయన టేబుల్ మీద పెట్టేశానని 'గోవిందుడు అందరివాడేలే' హీరో రాంచరణ్ చెప్పాడు. విజయదశమి సందర్భంగా హీరో రాంచరణ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్లను దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం అన్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. తనకు అమ్మదగ్గరే ఎక్కువ చనువని, అయితే పెద్ద పెద్ద విషయాలకు మాత్రం నాన్నను అడగాల్సి వచ్చినప్పుడు ఆయనకు లెటర్లు రాసేవాడినని చెర్రీ తెలిపాడు.
ఇంద్ర సినిమాలోని 'దాయి దాయి దామ్మా' పాట షూటింగ్ స్విట్జర్లండ్లో చేశారని, అప్పట్లో తనకు ఆ దేశం చూడాలని చాలా ముచ్చటగా ఉండేదని అన్నాడు. దాంతో నతకు సెలవులు మొదలైపోయాయని, స్నేహితులంతా కూడా ఊళ్లు వెళ్లిపోయారని, మీరు ఏమీ అనుకోకపోతే మీదోపాటు స్విట్జర్లండ్ వస్తానంటూ ఓ లేఖ రాశానన్నాడు. చివర్లో నాన్నా.. నో అని మాత్రం చెప్పద్దు ప్లీజ్ అని రాసినట్లు కూడా చెర్రీ వివరించాడు. దాన్ని ఆయన టేబుల్ మీద పెట్టేసినట్లు తెలిపాడు. దాంతో నాన్న నవ్వేసి, వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ అమ్మతో చెప్పారని, అలా స్విట్జర్లండ్ వెళ్లానని చెప్పాడు.