అధర్వకు జంటగా శ్రీ దివ్య
టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీ దివ్యకు కోలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఒకటి తరువాత మరొకటి అంటూ వరుసగా చిత్రాలు చేసుకుపోతోంది. ప్రతిభ ప్రాతిపదిక అన్నది ఈ చిన్నదాని విషయంలో నిజం అయ్యింది. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రం సక్సెస్ కావడం శ్రీదివ్యకు బాగా ఉపయోగపడింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయి అన్న ఇమేజ్ సంపాదించుకున్న ఈ సుందరికి తమిళ చిత్ర పరిశ్రమలో ఆదరణ పెరుగుతోంది.
ప్రస్తుతం సంగీత దర్శకుడు హీరోగా పరిచయం అవుతున్న పెన్సిల్ చిత్రంలో నటిస్తున్న శ్రీ దివ్యకు తాజాగా అధర్వతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరూ కలసి నటించనున్న చిత్రానికి ‘ఈ తి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు రవి అరసు మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి రానుంది. ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్, వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీదివ్య కాట్టుమల్లి, సుశీంద్రన్ దర్శకత్వంలో విష్ణు సరసన నటించనుంది.