టైటిల్ : అ!
జానర్ : థ్రిల్లర్
తారాగణం : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి
సంగీతం : మార్క్ కె రాబిన్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : నాని, ప్రశాంతి
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. అయితే నాని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న సినిమా కథాంశం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. కేవలం కథ, దర్శకుడిని నమ్మి నాని చేసిన ప్రయత్నం ఫలించిందా..? దర్శకుడు నాని నమ‍్మకాన్ని నిలబెట్టాడా..?
కథ :
కళి (కాజల్).. జీవితంలో ఎన్నో చేదు అనుభావాలతో విసిగిపోయి తన పుట్టిన రోజున ఓ తీవ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చివరి సారిగా చిత్ర (ప్రగతి) నిర‍్వహిస్తున్న ఫుడ్ కోర్ట్‌లో కూర్చోని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో రాధమ్మ(ఈషా రెబ్బా)తను ప్రేమించిన క్రిష్ (నిత్యామీనన్)ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అదే ఫుడ్ కోర్ట్‌కు వస్తుంది. ఈజీ మనీకోసం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేసిన మీరా(రెజీనా) అదే ఫుడ్ కోర్ట్‌లో పనిచేస్తుంటుంది. తనకు తాను గ్రేటెస్ట్ మెజీషియన్ అనుకునే యోగి (మురళీశర్మ) రెస్టారెంట్ లో ఉన్న చిన్నపాప మ్యాజిక్ చేస్తుంటే ఆమెతో గొడవ పడతాడు. అక్కడే డోర్ బాయ్‌గా పనిచేస్తున్న శివ తన చిన్నప్పుడే దూరమైన అమ్మనాన్నలు చూడాలన్న కోరికతో టైం మెషీన్ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క చెఫ్ అని అబద్ధం చెప్పి నలభీమ (ప్రియదర్శి) అదే ఫుడ్‌కోర్ట్ లో ఉద్యోగంలో చేరతాడు. ఇలా ఒకే చోట చేరిన ఈ వ్యక్తలకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటి..? కళి తీసుకున్న నిర్ణయం ఏంటి..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
నిడివి తక్కువే అయినా సినిమాలో కీలక పాత్ర కాజల్‌దే. అందుకు తగ్గ హవా భావాలతో కళి పాత్రకు ప్రాణం పోసింది కాజల్. కళి తరువాత ఆకట్టుకున్న మరో పాత్ర రెజీనా. మీరాగా కనిపించేందుకు చాలా కష్టపడ్డ రెజీనా పర‍్ఫామెన్స్‌తోనూ మెప్పించింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టామ్ బాయ్ తరహా పాత్రలో నిత్యామీనన్, ఆమె లవర్‌గా ఈషా రెబ్బాలు ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు లుక్స్ పరంగానూ మెప్పించారు. ఇక వంట రాని చెఫ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. ముఖ్యంగా చేప, చెట్టు, ప్రియదర్శి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. మెజీషియన్‌గా మురళీశర్మ కూడా అద్భుతంగా నటించాడు. టైం మెషీన్ తయారు చేయాలని భావించిన సైంటిస్ట్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. ఇతర పాత్రలో ప్రగతి, రోహిణి, దేవదర‍్శిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
మనిషి జీవితంలోని అనుభవాలు వాటి తాలుకా ప్రతిస్పందనల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక్కో ఎమోషన్‌ను ఒకో పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కోపం, బాధ, ప్రేమ, పగ, ఆవేశం లాంటి భావాలకు ప్రతీరూపాలుగా క్యారెక్టర్స్ వెండితెర మీద ఆవిష్కరించాడు. తొలి అర్థభాగం మొత్తం సినిమాలోని పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టడం ఆడియన్స్ లో అసహనం కలిగిస్తుంది. అయితే ఆడియన్స్ బోర్ ఫీల్ అయిన ప్రతీసారి అ! అనిపించే ట్వీస్ట్ తో షాక్ ఇచ్చాడు డైరెక్టర్. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా అవాక్కయ్యేలా చేసే ట్విస్ట్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు రీచ్ అవుతాయన్నదే చూడాలి. చేపకు నాని, చెట్టుకు రవితేజ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమాలకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఓ డిఫరెంట్ జానర్ తెరకెక్కిన సినిమాను అదే స్థాయి కెమెరా టెక్నిక్స్‌తో మరింత కొత్తగా మార్చాడు. మార్క్ కె రాబిన్ సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. టైటిల్ లో వచ్చే పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ అ! అనిపించాడు రాబిన్. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతగా నాని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కొత్తగా చూపించేందుకు యూనిట్ పడిన తపన తెర మీద కనిపిస్తుంది. అయితే రొటీన్ ఫార్ములా సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
లీడ్ క్యారెక్టర్స్ నటన
స్క్రీన్ ప్లే
సంగీతం
మైనస్ పాయింట్స్ :
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment