అప్పుడు110.. ఇప్పుడు 93!
‘బాహుబలి: ద కంక్లూజన్’లో పదవీ కాంక్షతో కూడిన శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తానని దగ్గుబాటి రానా చెప్పారు. ‘బాహుబలి: ద బిగినింగ్’లో మాహిష్మతి మహారాజుగా రానా నటన, క్రూరత్వం చూసిన ప్రేక్షకులు ‘భళా.. భల్లాల దేవ’ అన్నారు. ఇప్పుడీ సీక్వెల్‌లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నకు సమాధానంతో పాటు ఎక్కువగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చూపించనున్నారు.
ఫ్లాష్‌బ్యాక్‌లో భల్లాల దేవ పాత్రలో యువకుడిగా రానా కనిపించనున్నారు. అందుకోసం సుమారు 15 కేజీల బరువు తగ్గడంతో పాటు మరింత ధృడంగా తయారయ్యారు. ఫొటోలో మీరు చూస్తున్న ఫిజిక్‌లోకి వచ్చేశారు. మరో ఐదు రోజులు షూటింగ్ చేస్తే ‘బాహుబలి: ద కంక్లూజన్’లో నా పార్ట్ కంప్లీట్ అవుతుందన్నారు రానా. ఈ పాత్ర కోసం బరువు ఎలా తగ్గారో రానా వివరించారిలా...
‘బాహుబలి’ షూటింగ్ ప్రారంభానికి ముందే మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అది కంటిన్యూ చేశా. దాంతో పాటు కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌లలో శిక్షణ తీసుకున్నా. యువకుడిగా భల్లాల దేవ మరింత స్ట్రాంగ్‌గా, అదే సమయంలో కాస్త సన్నగా కనిపించాలి. అందుకే, బరువు తగ్గా. ఇప్పుడు నా బరువు 92-93 కేజీల మధ్య ఉంది. ‘బాహుబలి’లో 110 కేజీల భారీ దేహంతో కనిపించా.
ప్రతి రెండున్నర గంటలకు ఓసారి ఆహారం తీసుకునేవాణ్ణి. న్యూట్రీషియన్ ఎప్పుడూ పక్కనే ఉండేవారు. రెగ్యులర్‌గా చెకప్స్ చేస్తూ.. రైట్ ట్రాక్‌లో ఉన్నామా? లేదా? అని చూసేవారు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువుండే ఆహారం మాత్రమే తీసుకునేవాణ్ణి. ఆయిల్ ఫుడ్‌ను అస్సలు దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. నా ఫిట్‌నెస్ ట్రైనర్ కునాల్ గిర్ కూడా నేను తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించేవారు.