
హాలిడే తప్పదు మామా
‘‘నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’’... ‘బాహుబలి–2’లో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి ఈ డైలాగ్ చెబుతాడు. కట్టప్ప ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమరేంద్ర బాహుబలి అంటే ప్రభాస్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని మార్చి చెప్పమని ప్రభాస్‌ని అడిగితే.. ‘‘నాలుగేళ్లు నాన్‌స్టాప్‌గా పని చేసిన తర్వాత హాలిడే తీసుకోక తప్పదు మామా...’’ అంటారు. అవును మరి.
‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్ మామూలుగా కష్టపడలేదు. నాలుగేళ్లు పూర్తిగా ఈ సినిమాకు డెడికేట్ అయిన ప్రభాస్ కొంచెం రిలాక్స్ కావాలనుకుంటున్నారు. ‘బాహుబలి–2’ రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఇక, నెక్ట్స్ మూవీ షూట్‌లో బిజీ అయ్యేలోపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. అందుకే ప్రభాస్ యూఎస్ చెక్కేశారు. హాలిడే ఎన్ని రోజులు డార్లింగ్? అని అభిమానుల మనసులో ప్రశ్న మెదలకుండా మానదు.
ఒక నెల యూస్‌లో ఉండి, డార్లింగ్ ప్రభాస్ ఇండియా వచ్చేస్తారు. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమాతో బిజీ అయిపోతారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి’ తపస్సులో ఐదేళ్లకు పైనే ఇన్‌వాల్వ్ అయిన రాజమౌళి కుటుంబం కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కుటుంబం లండన్ వెళ్లింది.