డబ్బింగ్ సినిమాకు రూ. 60 కోట్ల వసూళ్లు!
సాధారణంగా హిందీలో తీసిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేయడం మనకు ఇంతవరకు తెలుసు. సల్మాన్ ఖాన్ ఎప్పుడో నటించిన 'మైనే ప్యార్ కియా' సినిమా 'ప్రేమ పావురాలు'గా డబ్ అయి.. తెలుగులో కూడా బంపర్ హిట్ అయ్యింది. అలా అటు నుంచి ఇటు రావడం తప్ప, ఇటు నుంచి అటు.. అంటే తెలుగులో తీసిన సినిమాలను హిందీలోకి డబ్ చేయడం, అవి భారీస్థాయిలో హిట్ కావడం మనకు పెద్దగా తెలియదు. చాలా తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసినా, అవి పెద్దగా వసూళ్లు సాధించకపోవడంతో ఆ విషయం ప్రచారంలోకి రాలేదు.
కానీ ఇప్పుడు ఒక తెలుగు సినిమాను హిందీలోకి డబ్ చేస్తే.. ఏకంగా అక్కడ రూ. 60 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికే అది ఏ సినిమానో అర్థమైపోయి ఉంటుంది కదూ.. అదే బాహుబలి! ఆదివారం వరకు మొత్తం రూ. 60.12 కోట్ల రూపాయల వసూళ్లు ఈ సినిమా హిందీ వెర్షన్కు వచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తెలుగు వెర్షన్ను హిందీలోకి, తమిళ వెర్షన్ను మళయాళంలోకి డబ్ చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్కు 7.5 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే చాలని మొదట్లో అనుకున్నారు. అది కాస్తా ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి మరి!
#Baahubali [dubbed Hindi version; Week 2] crosses ₹ 60 cr mark: Fri 3.25 cr, Sat 4.70 cr, Sun 5.40 cr. Total: ₹ 60.12 cr. FANTABULOUS!
— taran adarsh (@taran_adarsh) July 20, 2015