నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో కూడా తేజ దర్శకుడిగా కొనసాగారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు తాను ఎన్టీఆర్‌కు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక దశలో బాలయ్యే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరింత ఆలస్యమవుతుండటంతో బాలయ్య మరో సినిమా ప్రారంభించాలనుకుంటున్నారట.
చాలా రోజులుగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సీ కల్యాణ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి ఈ సినిమాను ముందుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట నందమూరి నటసింహం. అయితే ఈ విషయంపై ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment