అభిమానిపై శాతకర్ణి ఆగ్రహం
వందో చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాలకృష్ణ అభిమానులు మంచి సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లకు స్వయంగా బాలకృష్ణ కూడా వెళ్లడంతో ఇక అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఎలాగైనా బాలయ్య బాబును దగ్గర నుంచి చూడాలని, ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని పలువురు యువకులు ఉత్సాహపడుతున్నారు. కానీ.. సరిగ్గా ఇలాగే సరదా పడిన ఓ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్‌లో ఓ థియేటర్ నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణతో సెల్ఫీ తీసుకోడానికి ఓ కుర్రాడు ప్రయత్నించగా, ఆయన మాత్రం కోపంగా అతడి చేతిని విసిరికొట్టారు. దాంతో అతడి ఫోన్ కింద పడిపోయింది. ఆ తర్వాత కూడా బాలకృష్ణ అతడిని ఆగ్రహంతో తిడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతోంది.